నాచురల్ స్టార్ నాని మరోసారి బాక్సాఫీస్ యుద్దానికి రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'నేను లోకల్, నిన్ను కోరి' హిట్స్ తో యమా జోరు మీదున్న నాని ఇప్పుడు 'ఫిదా' సాయి పల్లవితో కలిసి 'MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి)'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ లో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాతో యువతని టార్గెట్ చేసాడనిపిస్తోంది.
'MCA' టీజర్ లో మిడిల్ క్లాస్ అబ్బాయిల పరిస్థితిని నాని వివరించే విధానం చాలా బావుంది. ఎప్పటిలాగే నాని అదిరిపోయే అభినయంతో ఆకట్టుకున్నాడు. అయితే అన్ని చోట్ల ముందుగా అబ్బాయిలే ప్రేమను అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తుండడం చూస్తుంటాం. కానీ 'MCA' లో మాత్రం నానికి డైరెక్ట్ గా సాయిపల్లవి లవ్ ప్రపోజ్ చేస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాని... పెళ్ళెప్పుడు చేసుకుందాం అంటూ చాలా నేచురల్ గా.... సింపుల్ గా గులాబీ ఇచ్చి మరీ అడిగేస్తుంది సాయి పల్లవి. దానికి నాని షాక్ అవుతూ ఒక చేతిలోని ఫోన్ వదిలేస్తూ.. మరో చేతితో ఆ గులాబీని అందుకునే అద్భుత దృశ్యం ఆకట్టుకుంది. అలాగే సాయి పల్లవి హాగ్ చేసుకుందాం రమ్మంటుంటే నాని పడే సిగ్గుంది చూశారూ... అది మరీ బావుంది. మరోసారి ఈ సినిమాతో నాని హిట్ కొట్టేస్తాడనే కాన్ఫిడెన్స్ మాత్రం వచ్చేస్తుంది.
'ఓ మై ఫ్రెండ్' చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక 'నేను లోకల్' తో నానికి మ్యూజికల్ హిట్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ మరోసారి 'MCA' తో నానికి హిట్ ఇవ్వబోతున్నాడు.