60ఏళ్లకు దగ్గరపడుతున్నా కుర్రహీరోలకు పోటీ ఇస్తున్న వారిలో సీనియర్ స్టార్ కింగ్ నాగార్జున ఒకరు. కాగా నాగచైతన్య, అఖిల్ ఇద్దరు నాగార్జున కుమారులు అన్న ట్యాగ్‌ని వదిలించుకుని స్వంతంగా క్రేజ్ తెచ్చుకోవడానికి బాగా కష్టపడుతున్నారని, తనకు తన కుమారుల సుఖం తప్ప ఇంకేమీ అవసరం లేదని నాగ్ స్పష్టం చేశాడు. ఇక హీరోలుగా మాత్రం తాము ముగ్గురం పోటీ పడుతామని, ఇది తండ్రి కొడుకుల సవాల్ అని చెప్పాడు.
ఇక నాగచైతన్య-సమంతల వివాహం తర్వాత పెద్దగా మార్పేమీ లేదని, పెళ్లి కాకముందు నుంచే సమంత తమ ఫ్యామిలీ మెంబర్‌గా ఉండేదని గుర్తుచేశాడు. పెళ్లి కాకముందు తనను నాగ్ సార్ అని పిలిచేది.. ఇప్పుడు మావయ్య అని పిలుస్తోంది. అదొక్కటే పెళ్లి తర్వాత వచ్చిన మార్పు అని తెలిపాడు. తాను 30ఏళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్నానని, అందులో అసంతృప్తులు కూడా ఉన్నాయని, అయితే అలాంటివి లేకపోతే లైఫ్ బోరింగ్‌గా ఉంటుందన్నాడు.
ఇక ఈనెల 20న ప్రారంభం కానున్న వర్మ చిత్రం గురించి మాట్లాడుతూ, మూడు నెలల ముందు వచ్చి వర్మ నాకు స్టోరీ చెప్పాడు. నేను ఓకే అనే లోపు మరో రెండు సినిమాలు తీసేద్దాంలే అని భావించకుండా ఈ చిత్రం స్క్రిప్ట్ మీదనే దృష్టి పెట్టాలని ఖరాఖండీగా చెప్పాను. వర్మ ఈ మధ్య తన స్థాయికి తగ్గ చిత్రాలు తీయడం లేదు. ఈ కొత్త చిత్రంలో ఆయన మరోసారి 'శివ'లాగా వెలుగులోకి వస్తాడని తెలిపాడు. ఇక ప్రస్తుతం నాగార్జున తన రెండో కుమారుడు అఖిల్ నటిస్తున్న రెండో చిత్రం 'హలో' అవుట్‌పుట్, విఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ విషయాలలో బిజీగా ఉన్నాడు. షూటింగ్‌ను ఈ నెల 20న ఆయన వర్మతో ప్రారంభించినా కూడా రెగ్యులర్ షూటింగ్ మాత్రం 'హలో' రిలీజ్ తర్వాతే ఉంటుందని సమాచారం.