విజయశాంతి మొదట బిజేపీలో ఉన్నారు. ఆమె బిజెపీలో ఉన్నప్పుడు ఆమెకి ఆ పార్టీ మంచి గుర్తింపునే అందించింది. తర్వాత సొంతపార్టీ పెట్టి, మరలా టిఆర్‌ఎస్‌లో చేరిపోయింది విజయశాంతి. తెలంగాణ ఇచ్చే ముందే ఆమెకి విషయం తెలిసి కాంగ్రెస్‌లో ఉంటే మంచి ప్రాధాన్యం ఉంటుందని, ప్రత్యేక తెలంగాణను కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీలే ఇప్పించారు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలో వస్తుందని, మరోసారి కేంద్రంలో కూడా కాంగ్రెసే విజయం సాధిస్తుందని పొరపాటుగా ఆమె తప్పుడు అంచనా వేశారు. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నిలబడి ఓడిపోయిన తర్వాత ఆమె తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న ఏ పోరాటంలో చురుగ్గా పాల్గొనలేదు. అసలు ఆమె ఈమద్యకాలంలో కనీసం వార్తల్లో కూడా ఉండటం లేదు.
కానీ తాజాగా ఆమె ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు, కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థి అయిన రాహుల్‌గాంధీని న్యూఢిల్లీలో కలిసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా, తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు ఏ పదవులు అవసరం లేదని, సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని విజయశాంతి రాహుల్‌గాంధీకి మాట ఇచ్చింది. తాజాగా రేవంత్‌రెడ్డి వ్యవహారంతో కాస్త ఉత్సాహం తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరలా విజయశాంతి క్రియాశీలకంగా మారడం కూడా శుభపరిణామమే.
దీంతో విజయశాంతికి ప్రచార కమిటీలో స్థానం, ఏఐసీసీ సెక్రటరి పదవి ఖాయమని, విజయశాంతి మాట వరుసకి సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని చెప్పినా కూడా ఆమెకు ఈ రెండు పదవుల్లో ఒకటి ఖాయమైన తర్వాతే ఆమె దీనికి అంగీకరించిందని సమాచారం. కానీ ఈమెకు ఏమాత్రం ప్రాధాన్యం ఉన్న పదవి ఇచ్చినా తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి కుమ్ములాటలు ఖాయంగా కనిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా పార్టీ కోసం, ఎన్నో ధర్నాలు, నిరసనలు, పోరాటాలు, చివరకు జైలుకు కూడా వెళ్లడానికి సిద్దపడ్డ తమని కాదని, ఈ నాలుగేళ్లు పార్టీ గురించి పట్టించుకోని విజయశాంతికి ప్రధానమైన పదవిని ఇవ్వడంపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.