దాదాపు ఒకేస్థాయి ఫాలోయింగ్, కాస్త అటుఇటుగా తమ సమకాలీనులుతో కలిసి నటిస్తేనే అది మల్టీస్టారర్ అవుతుంది. పాతకాలంలో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి వారు ఇలా పనిచేశారు. కానీ నేడు మల్టీస్టారర్స్ ఎక్కువగా బాలీవుడ్‌లో తప్ప టాలీవుడ్‌లో కనిపించడం లేదు. ఓ సీనియర్ స్టార్, మరో పక్క కాస్త పేరున్న హీరో కలిసి నటిస్తే చాలు దానిని మల్టీస్టారర్ అని డబ్బా కొట్టుకుంటున్నారు. కాస్త గుర్తింపు ఉన్న నలుగురు యంగ్ హీరోలు నటించిన 'శమంతకమణి'ని మల్టీస్టారర్ అని, నారా రోహిత్-శ్రీవిష్ణు కలిసి నటించినా మల్టీస్టారర్ అనేస్తున్నారు. ఇక సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్, రామ్‌లు కలిసి నటించిన 'మసాలా' చిత్రం కూడా మల్టీస్టారర్ అని ప్రచారం చేసుకున్నారు. కాస్తలో కాస్త 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల'లు మల్టీస్టారర్స్ అనిపించుకుంటాయి.
నిజానికి ఓ సీనియర్ స్టార్ మరో యంగ్ స్టార్ నటిస్తే అది కూడా మల్టీస్టారర్ కాదనే చెప్పాలి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా వీరు కలిసి నటిస్తే అది మల్టీస్టారర్. ఇక పవన్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్, ప్రభాస్ వంటి సమఉజ్జీలు చేస్తే అదే నిజమైన మల్టీస్టారర్ అనవచ్చు. కానీ మనం నాగార్జున-కార్తి నటించిన 'ఊపిరి'కి కూడా మల్టీస్టారర్ బిరుదు ఇచ్చేశాం. ఇక విషయానికి వస్తే ఏ హీరో కూడా ఫలానా వారితో నటిస్తారా? అని అడిగితే నా పాత్ర బాగుంటే, కథ బాగుంటే ఖచ్చితంగా చేస్తానని చెబుతాడే గానీ చేయనని చెప్పడు. నిజానికి హీరోలకు చేయాలని ఉన్నా అభిమానులు ఒప్పుకోవడం లేదు. చిన్న కామియో పాత్రలో స్టార్ నటిస్తే అది కూడా మల్టీస్టారర్ అంటున్నారు. ఇక తాజాగా మన హీరోలు పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా నటిస్తామని చెబుతున్నారు. ఆమధ్య మంచు మనోజ్ తాను సాయిధరమ్‌తేజ్ కలిసి 'బిల్లారంగా'కి రీమేక్‌గా మల్టీస్టారర్ చేస్తామని జోక్ పేల్చాడు.
ఇక తాజాగా దిల్‌రాజు మనవడి ఫంక్షన్‌కి మహేష్‌బాబు, కళ్యాణ్‌రామ్, సాయిధరమ్‌తేజ్, వంశీ పైడిపల్లి, హరీష్‌శంకర్‌లు హాజరయ్యారు. అప్పుడు వంశీపైడిపల్లి మహేష్‌ని సాయితో కలిసి నటిస్తారా? అనడం మంచి కథ తెస్తే చేస్తానని మహేష్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మరి మహేష్ ఇమేజ్ ఎక్కడ? సాయి ఇమేజ్ ఎక్కడా? అది కూడా మల్టీస్టారర్ అవతుందా? అనే అనుమానం రాకమనాదు. ఇక కొందరైతే మహేష్ తన 25వ చిత్రంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు-అశ్వనీదత్‌ల చిత్రంలో సాయి కూడా నటిస్తాడని ప్రచారం మొదలుపెట్టేశారు. కానీ అది నిజం కాదు. ఏదో మాట వరసకి మొహమాటం కొద్ది చెప్పిన దానిని కూడా మనోళ్లు బాగా ప్రచారం చేస్తున్నారు.