బహుశా ఇప్పుడు రాజశేఖర్ ఉన్న ఆనందంలో ఎవ్వరూ ఉండరేమో...! సాధారణంగా పెద్ద హిట్ వస్తే హీరోలు పండగ చేసుకుంటారు. కానీ రాజశేఖర్ మాత్రం 'పీఎస్వీగరుడవేగ' విజయంతో గాలిలో తేలుతున్నాడు. ఈ చిత్రం విషయంలో మొదటి నుంచి రాజశేఖర్, దర్శకుడు ప్రవీణ్‌సత్తార్‌లు మంచి కాన్ఫిడెన్స్‌తోనే కనిపించారు. దానికి ఉదాహరణే ఐదుకోట్ల మార్కెట్ కూడా లేని రాజశేఖర్ చిత్రానికి 30కోట్ల దాకా బడ్జెట్ పెట్టడమే కారణం. అయినా కూడా రాజశేఖర్ ఈ చిత్రం ఆడదని భావించాడట.
ఈ చిత్రం విడుదలకు మూడు వారాల ముందే తన తల్లి చనిపోయిందని, సినిమా మరో రెండు రోజుల్లో విడుదల అనుకున్నప్పుడు జీవిత సోదరుడు, ఈ చిత్రం ఆన్‌లైన్ ప్రొడ్యూసర్ మురళి చనిపోవడంతో తనకు కాలం కలిసి రావడం లేదని, తన టైం బాగోలేదని భావించాడట. ఇవ్వన్నీ ఆయనకు అపశకునాలుగా అనిపించాయి. ఇక చెన్నైలో వరదలు రావడంతో అవి తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చేస్తాయని ప్రకృతి మీద కూడా కాస్త అనుమానం వ్యక్తమైందని, కానీ ఈ చిత్రం విజయం సాధించడం తనలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన చెప్పాడు.
ఈచిత్రం విషయంలో ఆయన బాలకృష్ణ, చిరంజీవిలకు థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఆయన మాట్లాడుతూ, నాకు లేడీస్‌లో మంచి ఫాలోయింగ్ ఉందనేది నా నమ్మకం. అందుకే కుర్రాళ్లకు మీ ఇంట్లోని మహిళలను తీసుకెళ్లండని చెప్పాను. నా తల్లి చనిపోయినా నాకు తెలుగు రాష్ట్రాలలో ఎందరో తల్లులు ఉన్నారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఓ అమ్మని ఇదే అడిగాను. మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకొచ్చాడా? అని ప్రశ్నించాను.. దానికి ఆమె 'వాడు నన్ను తేవడం ఏమిటి? నేనే వాడిని తీసుకొచ్చాను అని చెప్పింది' అని రాజశేఖర్ అంటున్నాడు.
ఇక జీవిత మాత్రం దేవుడు సంతోషాలతో పాటు దు:ఖాలను కూడా ఇస్తాడు. సంతోషానికి ఎంత ఆనందపడతామో, దు:ఖాలను కూడా ఒకేలా భరించాలి. అందుకే నేను నా సోదరుడు చనిపోయినా ఈ సక్సెస్ మీట్‌కి వచ్చానని తెలిపింది. మొత్తానికి ఈ చిత్రం యాక్షన్ ఓరియంటెడ్ కావడం, వీక్‌డేస్‌లో కూడా బాగా ఆడాల్సి ఉండటంతో ఇప్పుడు రాజశేఖర్ మహిళా సెంటిమెంట్‌ని వాడుతున్నాడు. మరి ఈ సెంటిమెంట్ అయినా ఈ చిత్రం పెట్టుబడిని తిరిగి తెచ్చి, లాభాలను పంచుతుందనే ఆశిద్దాం....!