గతంలో ఓ ఊపు ఊపిన పరుచూరి బ్రదర్స్, పోసానికృష్ణవంశీ వంటి రచయితలు, ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన పి.సి.శ్రీరాం, సంతోష్‌శివన్, రసూల్ వంటి వారు కూడా దర్శకులుగా మారి ఏదో చేద్దామని ప్రయత్నించారు. వీరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి సక్సెస్ అయిన వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తన కుమారుడి అత్యద్భుత కెరీర్‌కి కుడి భుజంగా చెప్పవచ్చు. ఇప్పటివరకు ఓటమి ఎరుగని చిత్రాలను తీసిన రాజమౌళికి అంత అద్భుతమైన కథలను, స్క్రీన్‌ప్లే వంటివి అందించిన విజయేంద్రప్రసాద్ ఓ మూల స్తంభం.
ఇక ఆయన ఇటీవలి కాలంలో వచ్చిన 'బాహుబలి-ది బిగినింగ్, భజరంగీ భాయిజాన్, బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రాలతో పాటు 'మెర్శిల్' విజయంలో కూడా ఆయనకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా హస్తం ఉంది. తాజాగా ఈయన 'భజరంగీ భాయిజాన్' చిత్రాన్ని చిరంజీవి నటించిన 'పసివాడి ప్రాణం' నుంచే స్ఫూర్తిగా తీసుకున్నానని, ఓ విషయాన్ని కాపీ కొట్టడం, స్ఫూర్తి పొందడంలో ఎంతో వ్యత్యాసముందని తెలిపాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, మరో సంచలన నిర్ణయం ప్రకటించాడు. ఇకపై దర్శకత్వానికి దూరంగా ఉండదలుచుకున్నాను. ఎవరి పని వారు చేయడమే మంచింది. మనకు అన్ని వచ్చేశాయి అని భావించడం తప్పని తాను తీసిన మూడు చిత్రాల ద్వారా తెలిసింది. ఇకపై దర్శకత్వం జోలికి పోకుండా రచయితగానే కొనసాగుతానని ప్రకటించాడు. ఇక ఆయన 'శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లి' చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేకపోవడమే కాదు నిర్మాతలకు నష్టాలను తీసుకొచ్చాయి. దాంతో ఆయన ఇక దర్శకత్వంలో చేయకూడదని నిర్ణయించుకున్నాడు. నేడు టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా రచయితల, కథల కొరత ఉంది. పూర్తిస్థాయిలో విజయేంద్రప్రసాద్ రచయితగా పనిచేస్తే ఆ లోటు కాస్తైనా తీరుతుందనే చెప్పాలి.