తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించిన వెటరన్ హీరోయిన్ వాణివిశ్వనాథ్. కాగా ఆమె ఈరోజు అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతోంది. ఇక ఈ సందర్భంగా తాజాగా ఆమె విజయవాడ వెళ్లి కనకదుర్గని దర్శించుకుంది. తనకు తెలుగుదేశం పార్టీ విధానాలు, చంద్రబాబు పాలన అంటే ఎంతో ఇష్టమని అందుకే ఆ పార్టీలో చేరుతున్నానని చెబుతోంది. ఇంతకీ ఆమెకి తెలుగుదేశంలోని పార్టీ విధానాలు, చంద్రబాబు గొప్పతనం ఏమిటో? కేవలం టిడిపిలో చేరడానికి కారణం ఏమిటో మాత్రం చెప్పలేదు. స్వతహాగా మలయాళీ అయిన ఈమె కేరళ రాజకీయాలను వదిలేసి, ఏపీ మీద ఎందుకు పడిందో సమాధానం లేదు. ఇక చిత్తూరు జిల్లా నగిరి నుంచి రోజాని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పింది.
తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తీస్తున్న 'లక్ష్మీస్ వీరగ్రంధం'లో లక్ష్మీపార్వతి పాత్రను చేయమని అడిగాడని, ఆ విషయం తన మేనేజర్‌తో మాట్లాడమని చెప్పిందట. ఇక ఈ చిత్రంలో ఎలాగూ లక్ష్మిపార్వతిని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఆమె నటించడానికి అంగీకరించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఎందుకంటే లక్ష్మిపార్వతిని టార్గెట్ చేయడమే టిడిపికి కూడా కావాల్సింది. ఇక తాను ప్రస్తుతం ప్రజల సమస్యలు, రాజకీయంగా ఏమేమి మంచి పనులు చేయాలో వాటి గురించే ఆలోచిస్తున్నానని, సినిమాల గురించి ఆలోచించండం లేదని సెలవిచ్చింది.
ఇటీవలే ఆమె 'జయజానకి నాయకా' ద్వారా తెలుగులోకి సపోర్టింగ్ రోల్‌తో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈమెను రోజాను టార్గెట్ చేయడానికే టిడిపిలోకి తీసుకుంటున్నారని, రోజాలాగా వాణివిశ్వనాథ్ కూడా ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ కోసం పాకులాడుతోందనేది సుస్పష్టం. మరోవైపు వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో రోజా లక్ష్వీపార్వతిలా నటించి, 'లక్ష్మీస్ వీరగ్రంధం'లో వాణి విశ్వనాధ్ లక్ష్మీపార్వతిగా నటిస్తే రాజకీయ పరంగానే కాదు.. సినిమాల పరంగా కూడా ఈ రెండు చిత్రాలకు బోలెడంత పబ్లిసిటీ రావడం ఖాయమనే చెప్పవచ్చు.