భీమవరంలో పుట్టి, లెక్చరర్‌గా పనిచేస్తూ, తెలుగు భాషపై, ఇతిహాసాలు, పురాణాలపై ఎంతో పట్టుసాధించిన ఓ యువకుడు తాను అనుకున్నది ఇది కాదని, తన ప్రతిభను పదిమందికి చూపించాలనే పట్టుదలతో హైదరాబాద్‌కి వచ్చి సినిమాలలో అవకాశం కోసం నానా కష్టాలు పడ్డాడు. ఆయనకు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. భాషపై పట్టుకోసం అహర్నిశలు పనిచేస్తూ ఉంటాడు. తనకి ఏదో పేరు వచ్చేసింది కదా..! అని ఆయన ఇప్పటికీ మౌనంగా ఉండడు. ఇప్పటికీ ఇంకా ఏదో తెలుసుకోవాలనే తపనే ఆయన్ను ఈ స్థాయికి చేర్చింది. ఆయన ఓ సారి సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి చేసిన ప్రసంగం విన్నవారెవ్వరైనా సాహో అనాల్సిందే. ఆయన ఆకెళ్ల నాగ శ్రీనివాస్ శర్మ అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఆయన హైదరాబాద్‌కి వచ్చినప్పుడు సునీల్‌తో కలసి ఓ రూమ్‌లో ఉంటూ ట్యూషన్లు కూడా చెప్పాడు. చివరికి ఆయనకు పోసాని కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్‌గా ఛాన్స్ వచ్చింది. ఇక ఆయన 'స్వయంవరం'తో రచయితగా తన పేరును మొదటి సారి స్క్రీన్‌పై చూసుకున్నాడు. ఇక ఓ దర్శకునిగా రచయిత అనే వ్యక్తి ఎంతగా ఉపయోగపడతాడు? అనే విషయం ఆయన పనిచేసిన దర్శకుడు విజయ్ భాస్కర్‌కి బాగా అనుభవమై ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ విజయభాస్కర్ వద్ద పనిచేసినంత కాలం ఆయన దర్శకత్వంలో వచ్చిన 'స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, చిరునవ్వుతో, మన్మథుడు, మల్లీశ్వరి' ఇలా ప్రతి చిత్రం ఓ ఆణిముత్యమే.
కానీ త్రివిక్రమ్ బయటికి వచ్చిన తర్వాత విజయభాస్కర్‌కి ఒక్క హిట్ కూడాలేదు. ఇక ఆయన 'నువ్వే..నువ్వే'తో దర్శకునిగా అవతారం ఎత్తాడు. అందులో హీరో హీరోయిన్ తండ్రిని ఉద్దేశించి, నాలాంటి వాడిని, తాజ్‌మహల్‌ని చూసి ఆనందించాలే గానీ స్వంతం చేసుకోవాలని అనుకోకూడదు అని అర్ధం వచ్చేలా రాసిన డైలాగ్ త్రివిక్రమ్‌కి కూడా బాగా వర్తిస్తుంది. త్రివిక్రమ్ తీసిన, రాసిన చిత్రాలను, డైలాగ్‌లను వినాలే గానీ ఆయనలా రాయాలని, తీయాలని ప్రయత్నిస్తే వీలుకాదు. ఇక 'నువ్వేనువ్వే' తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక్క 'ఖలేజా' తప్ప కమర్షియల్‌గా ఫ్లాప్ అయిన చిత్రం లేదు. అయినా 'ఖలేజా' ఎందుకు ఆడలేదు అనేది ఎవ్వరికీ అర్దం కాని విషయం. ఈచిత్రాన్ని ఎప్పుడు వచ్చినా బుల్లితెరపై వీక్షకులు ఎంతో ఆదరిస్తూ, ఎన్నిసార్లైనా చూస్తూ ఉంటారు. ఇక జంధ్యాల తర్వాత అతి కొద్ది కాలంలోనే మాటల మాంత్రికుడిగా ఈయనకు తప్ప మర్వెవ్వరికీ ఇలాంటి గుర్తింపు రాలేదు. నవ్విస్తూ ఏడిపిస్తాడు... నవ్విస్తూ.. ఆలోచింపజేస్తాడు. ఆయన కలానికి అన్ని వైపులా పదునే. ఆయన సెటైర్లకు ఎలాంటి స్పందనలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
'నువ్వేనువ్వే, అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, ఆ..ఆ' ఇలా ఆయన చిత్రాలలో ఆహ్లాదమే కాదు.. అత్త కూడా అమ్మలాంటిదని, తండ్రిని మించిన హీరో ఉండడని, ఈజీమనీకోసం అడ్డదారులు తొక్కవద్దని.. ఇలా ప్రతి చిత్రంలో ఏదో సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన పవన్ చిత్రం చేస్తున్నాడు. తర్వాత ఎన్టీఆర్, చిరంజీవి, మహేష్ చిత్రాలు వరుసలో ఉన్నాయి. నేడు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా సినీజోష్ ఆయనకు శుభాకాంక్షలను తెలుపుతోంది.