ఈ మధ్యన చిన్నా లేదు, పెద్దా లేదు ప్రతి ఒక్క హీరో మల్టీస్టారర్ చిత్రాల్లో కనబడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదివరలో ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటించాలంటే మాత్రం తెగ ఆలోచించేవారు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు కలిసి నటించేస్తారు. వారికీ ఎలాంటి ఈగోస్ ఉండవు. కానీ టాలీవుడ్, కోలీవుడ్ లలో మాత్రం ఏ ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ సినిమా చెయ్యాలన్నా ఒకపక్క దర్శకులకు చమట్లు పట్టేస్తాయి. ఎందుకంటే ఇద్దరు హీరోల్లో ఏ హీరోని తక్కువ చేసి చూపించకూడదు. ఒక వేళ అలా జరిగితే వారి అభిమానులనుండి నానా రచ్చ మొదలవుతుంది.
కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ చిత్రాలు బాగానే తెరకెక్కుతున్నాయి. వెంకటేష్, మహేష్ నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు.... వెంకటేష్, పవన్ నటించిన గోపాల గోపాల... మొన్నీమధ్యనే నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది, సుధీర్ బాబులు నటించిన శమంతకమణి సినిమాలే కాకూండా ఇప్పుడు కొత్తగా నాగార్జున, నాని తో కలిసి అశ్వినీదత్ ఒక మల్టీస్టారర్ చిత్రానికి సై అన్నాడు. అయితే ఇప్పుడు మరో మల్టీస్టారర్ చిత్రానికి బీజం పడిందని... అదికూడా మహేష్ బాబు - సాయి ధరం తేజ్ ల కాంబోలో ఈ సినిమా ఉండబోతుందంటూ వార్తలొస్తున్నాయి.
రెండ్రోజుల క్రితం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తన మనవడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకలకు మహేష్ బాబు, సాయి ధరమ్ తేజ్, వంశి పైడిపల్లి, హరీష్ శంకర్ మొదలగువారు ఈ పార్టీకి హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో మహేష్ 25 వ సినిమా దర్శకుడు వంశి పైడిపల్లి ఈ మల్టీస్టారర్ గురించిన ప్రస్తావన తేవడమే కాకూండా మెగా మేనల్లుడితో మల్టీస్టారర్ లో నటిస్తారా అంటూ మహేష్ బాబును అడగగా.. దానికి మహేష్ నవ్వుతూ మీరు కథ తీసుకురండి.. నేను ఎందుకు చెయ్యను చెప్పండి అనేశాడట . దీనిపై రియాక్ట్ అయిన సాయి ధరం తేజ్ కూడా నేను కూడా రెడీ అన్నా అంటూ ప్రకటించేశాడట. మరి ఏదో సరదాగా జరిగిన ఈ సంభాషణే ఇప్పుడు మరో మల్టీస్టారర్ కి దారితియ్యబోతుందంటూ కథనాలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి.