రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్‌లో మన సినీ పరిశ్రమ స్ధిరపడింది. మద్రాస్ నుంచి హైదరాబాద్‌కి పరిశ్రమ తరలించడానికి నాడు ఎందరో సినీ ప్రముఖులు, నాటి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు కృషిచేశారు. ఇక సమైక్యాంద్ర కాస్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా విడిపోయిన తర్వాత తెలంగాణకు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లోనే పరిశ్రమ ఉండిపోయింది. కానీ కొందరు సినీ ప్రముఖులు వైజాగ్, తిరుపతి, చెన్నైకి దగ్గరగా, మన ఏపీకి బోర్డర్‌లో ఉండే తడలో కూడా స్టూడియోలను నెలకొల్పి సినిమా పరిశ్రమను ఏపీకి తెచ్చే ఆలోచన కూడా చేశారు.
కానీ కొందరు మాత్రం హైదరాబాద్‌లో తమకున్న అత్యంత విలువైన స్టూడియోలు, ఇళ్లులు వదిలిపెట్టి ఏపీకి రావడం ఎందుకు? అని ఆలోచన చేశారు. దానికి తోడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సినిమా వారికి కావాల్సిన వసతులన్నీ కల్పిస్తామని చెబుతుండటంతో సినీ పరిశ్రమ హైదరాబాద్‌కే పరిమితమైంది. ఇక ఏపీలో సినీ పరిశ్రమ నిలబడాలంటే సినీ ప్రముఖులు కోరుకున్న విధంగా విలువైన స్థలాలను స్టూడియోలకు, ఇన్‌ఫ్రాస్టక్చర్‌కి కేటాయిస్తేనే సాధ్యపడుతుంది. కానీ ఆ దిశగా ఏపీలోని చంద్రబాబు సినీ ప్రముఖులకు భరోసా ఇవ్వడంలో విఫలమయ్యారనే చెప్పాలి. సినిమా వారు ఊరికినే రమ్మంటే రారు. వారికి ఆర్ధిక ప్రయోజనాలు సమకూరితేనే వస్తారు.
ఇక తాజాగా దీనిపై కేంద్ర సెన్సార్‌బోర్డ్ సభ్యుడు దిలీప్‌రాజ్ స్పందించారు. సినీ పరిశ్రమను ఏపీకి తీసుకురావడంలో ఇక్కడి ప్రభుత్వం విఫలమైందని, పరిశ్రమను ఏపీకి తేవడంలో ప్రభుత్వంలో చిత్త శుద్ది కనిపించడం లేదని ఘాటు విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో చిత్రపురి కాలని, ఫిలింనగర్, స్టూడియోలు వంటివి ఉన్నట్లు అలాంటివి అమరావతిలో కూడా కేటాయిస్తే పరిశ్రమ పెద్దలు ఏపీకి వస్తారని, తనకు తెలిసి రాజధానిలో స్టూడియోలకు భూములు కేటాయిస్తే పది మంది పెద్దలు ఏపీకి రావడానికి సిద్దంగా ఉన్నారన్న విషయం తనకు తెలుసని చెప్పాడు. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సివుంది. రాజమౌళి, బోయపాటిలతో ఆయన రాజధాని డిజైన్లు, పుష్కరాల గొప్పతనాన్ని చూపించడానికే పరిమితమవుతాడా? ఏపీలో కూడా సినీ పరిశ్రమను అభివృధ్ది చేయడానికి చర్యలు తీసుకుంటాడా? అనేది చూడాలి.