రవితేజ 'రాజా ది గ్రేట్' సక్సెస్ తో ఉత్సాహం మీదున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదున్న 'టచ్ చేసి చూడు' సినిమాతోపాటే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా తమిళంలో హిట్ అయిన 'బోగన్' సినిమా రీమేక్ లో నటించనున్నాడని ప్రచారం జరిగింది. తమిళ 'బోగన్' దర్శకుడు లక్షణ్ తెలుగులో రవితేజ తో ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడని.. అలాగే ఈ సినిమాలో రవితేజకి జోడిగా ముందు కేథరిన్ అని.. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ అని అన్నారు. ఇక ఈ సినిమాని తెలుగులో 'చుట్టాలబ్బాయి' నిర్మాతలు తెరకెక్కిస్తున్నట్లుగా గట్టిగానే ప్రచారం జరిగింది.
కానీ ఒక ఐదారు రోజుల క్రితం 'బోగన్' రీమేక్ తెలుగులో ఆపేసినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమాని రవితేజ చేయనన్నాడని.. అందుకే తెలుగులో ఈ సినిమా ఆగిపోయిందనే కథనాలు ప్రసారం అయ్యాయి. తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేద్దామనుకున్న 'బోగన్' డైరెక్టర్ లక్ష్మణ్.. ఈ సినిమా నుండి రవితేజ తప్పుకోవడంపై స్పందించాడు. రవితేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంపై ఆయన అసహనం వెళ్లగక్కడమే కాదు... అసలు రవితేజ ఈ రీమేక్ కి ఓకే చెప్పాకే.. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టామని చెబుతున్నాడు.
రవితేజ బాడీ స్టైల్ కి, తెలుగు నేటివిటీకి తగినట్లుగా... మార్పులు చేర్పులు చేశానని.. దాదాపు ఆరు నెలల పాటు తన టీంతో కలిసి ఈ సినిమాపై పని చేశానని.. కానీ ఇప్పుడు రవితేజ సడెన్‌గా ఈ సినిమా చేయలేనని చెప్పడంతో తీవ్ర నిరాశ కలిగిందని చెబుతున్నాడు. అన్నీ పూర్తి చేసుకున్నాక హీరో సడన్ గా తప్పుకుంటే... ఇప్పుడు ఆ ప్రాజెక్టులోకి వేరే హీరోని ఎవరినైనా తీసుకోవాలా... లేకుంటే.. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడం ఆపేయాలా అని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నాడు లక్ష్మణ్. మరి లక్ష్మణ్ ఆరోపణలపై రవితేజ స్పందన ఏమిటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.