చిరంజీవి 151 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'సై రా నరసింహారెడ్డి'గా తెరకెక్కబోతుంది. ఈ సినిమా మొదలై రెండున్నర నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సెట్స్ మీదకెళ్ళలేదు. అసలు సెట్స్ మీదకెప్పుడు వెళుతుందో కూడా క్లారిటీ లేని ఈ సినిమా గురించిన అనేక రకాల వార్తలు నిత్యం మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇకపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన పేరు చెబితేనే ఆనాటి ప్రజల మాటల్లో ఆవేశం కనబడుతుంది. అలనాటి ప్రజలు ఉయ్యాలవాడని జయ జయ ధ్వనాల మధ్యన ఎంతో గౌరవించేవారు.
అంతటి సమరయోధుడు సినిమాని తెరకెక్కిస్తున్నప్పుడు.... కేవలం అతనిలాంటి లుక్, ఆహార్యం, గట్స్ ఉంటేనే సరిపోదు.. దానికి తగ్గట్టుగా బలమైన డైలాగ్స్, మనసును తాకే మాటలుతో పాటు ఒళ్ళు జలదరించే మాటలు కూడా ఉండాలి. మరి అలాంటి డైలాగ్స్ కోసం పరుచూరి బ్రదర్స్ తో పాటు మరో రచయిత బుర్రా సాయిమాధవ్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకుని పవర్ ఫుల్ డైలాగ్స్ రాయిస్తున్నారట 'సై రా' బృందం. మరి సాయిమాధవ్ కూడా అప్పటి చరిత్రను కూలంకషంగా పరిశీలించి నరసింహారెడ్డి పౌరుషం ఉట్టిపడేలా బలమైన డైలాగ్స్ కోసం కుస్తీ పడుతున్నాడట.
సాయి మాధవ్ రాసే పవర్ ఫుల్ డైలాగ్స్ ని ఉయ్యాలవాడ పాత్రలో 'సై రా నరసింహారెడ్డి' గా చిరంజీవి అలవోకగా చెప్పేస్తాడు. అందులో ఎటువంటి అనుమానము లేదు. ఎందుకంటే మాస్ డైలాగ్స్ ని చిరు ఎలా పవర్ ఫుల్ గా చెబుతాడో తెలిసిందే. ఇక 'సై రా' చిత్రంలో హీరోయిన్స్ గా నయనతార, ప్రగ్య జైస్వాల్ ఎంపిక కాగా మరో హీరోయిన్ ని 'సై రా' యూనిట్ ఫైనల్ చెయ్యాల్సి ఉంది.