తమ తల్లిదండ్రుల ఆస్తులు, వారి వారసత్వంగా వచ్చే కీర్తిప్రతిష్టలు, పదవులు, స్టార్ అవకాశాలు, లగ్జరీ లైఫ్‌లు మాత్రం వారి సంతానానికి కావాలి. కానీ వారి జీవితం చివరిదశలో వారిని ఆదరించే సంతానాలు ఇప్పుడు లేవు. ఇక స్వర్గీయ ఎన్టీఆర్ 14మంది సంతానం ఆయన పేరు చెప్పుకుని బాగా సెటిల్ అయ్యారు. ఇప్పటికీ వారు ఎన్టీఆర్ పేరును వాడుకుంటూనే ఉన్నారు. కానీ ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో ఆయన కొడుకులు, కోడళ్లు, కూతుర్లు, అల్లుళ్లు ఆయన నుంచి పదవులు... ఇతర విషయాలను ఆశించారే గానీ ఎన్టీఆర్ యోగక్షేమాలు కూడా పట్టించుకోలేదని కొందరు ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతారు. దాంతో వారిపై కోపం, పంతంతోనే ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి తోడును కోరుకున్నాడనేది సహజంగా వినిపించే మాట. ఇక విషయానికి వస్తే ఎంతో మంది సామాన్యులు కూడా తమ తండ్రులు, తాతలు కట్టించిన ఇళ్లను ఖాళీగా అయినా ఉంచుతారు గానీ వారి జ్ఞాపకాలకు గుర్తుగా వాటిని భావిస్తూ తమ వద్దే ఉంచుకుంటారు. కానీ ఆ జ్ఞాపకాలను కోట్లు వస్తాయని తెలిసినా వారి వారసులు వాటి కోసం ఆశపడరు.
కానీ ఎన్టీఆర్ నివసించిన ఎన్నో జ్ఞాపకాలు, మధురస్మృతులకు నెలవైన ఆయనకి చెందిన చెన్నైలోని అంటే నాటి మద్రాస్‌లో నివాసం నేడు ఆలనా పాలనా లేక పురాతనంగా మారి, బూత్‌బంగళాగా తయారైంది. నాడు తిరుపతికి వచ్చే భక్తులందరూ అటు నుంచి మద్రాస్‌కి వెళ్లి ఆయనను చూసి దేవునిగా భావించి మొక్కేవారు. ఇక ఎన్టీఆర్ నటునిగా కాస్త స్థిరపడిన తర్వాత చెన్నైలోని ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. దాంతో ఆ వీధికి ఎన్టీఆర్ వీధిగా పేరొచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి నాటి ప్రముఖ హాస్యనటుడైన కస్తూరి శివరాంకు చెందిన చెన్నైలోని బజుల్లా రోడ్డులో ఉన్న 28వ నెంబర్ ఇంటిని ఆయన కోనుగోలు చేశారు. దానిని కొన్నతర్వాతే తనకు బాగా అదృష్టం కలిసి వచ్చిందని, ఆ ఇంటిని ఎన్టీఆర్ ఎంతో సెంటిమెంట్‌గా భావించారు. 1953లో ఆ ఇంటిని కొన్న ఎన్టీఆర్ దానికి మరమత్తులు చేయించి, తన ఇంటిగానే కాదు.. ఆఫీసుగానూ ఉపయోగించుకున్నాడు. ఇక తన పాత ఇంటిని తన సోదరుడు త్రివిక్రమ్‌రావుకి ఇచ్చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబం అంతా హైదరాబాద్‌కి వచ్చేసింది. అయినా కూడా తాను బతికున్నంత కాలం ఎన్టీఆర్ దాని బాగోగులు చూసేవారు.
ఆయనకు మద్రాస్ అన్నా, తాను మొదట నివసించిన ఇళ్లన్నా ఎంతో ప్రేమ, సెంటిమెంట్. అందుకే మద్రాస్‌కి ఆయన తెలుగు గంగని ఇచ్చి తన రుణం తీర్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఎంతో అపురూపంగా చూసుకున్న బజుల్లా రోడ్డులోని 28వ నెంబర్ ఇంటిని ఆయన వారసులు అమ్మకానికి పెట్టారు. గేట్‌కి ఇల్లు అమ్మబడును అనే బోర్డ్‌ని తగిలించి, బ్రోకర్ ఏలుమలై పేరు, ఆయన ఫోన్ నెంబర్‌లతో బోర్డ్‌ని తగిలించారు. ఘన చరిత్ర, జ్ఞాపకాలు ముడివేసుకుని టి.నగర్ బజుల్లా రోడ్డులోని ఆయన ఇంటిని చూసిన అభిమానులు ఆలనా పాలనా లేక పాడు బడ్డ ఆ ఇంటిని, దాని దుస్థితిని చూసి ఆవేదన చెందుతున్నారు.