కొందరికి బిరుదులు అలంకారం అవుతాయి. మరికొందరి విషయంలో మాత్రం ఆ బిరుదులు ఇచ్చిన వ్యక్తి వల్ల వాటికి సార్ధకం ఏర్పడుతుంది. స్వరజ్ఞాని, స్వర బ్రహ్మ.... ఇలాంటి బిరుదులు ఎన్నైనా ఇళయరాజాకి సరిపోవు. ఆయన పుట్టి సంగీతం అందించిన కాలంలోనే మనంకూడా పుట్టడం మన అదృష్టం. ఆయన పాటలు వింటే ఎంతో ఆహ్లాదంగా, రాళ్లు కూడా కరిగిపోతాయి అనిపిస్తుంది. ఆయన పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. ఇక సరిగమలలో మ్యాజిక్ చేయడం, ఎన్నో వైవిధ్యభరితమైన కలకాలం గుర్తుండి పోయే పాటలను ఆయన అందించారు. కాగా ఈనెల 5వ తేదీన హైదరాబాద్‌లో స్వరజ్ఞాని ఇళయరాజా మ్యూజికల్ కన్సర్ట్ జరగడం హైదరాబాదీల అదృష్టం. ఆయనను స్వయంగా చూడటం, ఆయన లైవ్‌షో వినడం అంటే జన్మకి అంతకన్నా ఏమికావాలి?
ఇక విషయానికి వస్తే ఈ ఇళయరాజా మ్యూజిక్ కన్సర్ట్‌కి ఫ్రీపాస్‌ల కోసం ఓ మీడియా సంస్థ క్విజ్ నిర్వహించింది. ఈ డ్రాలో సంగీత దర్శకుడు, గాయకుడు, దర్శకుడు అయిన ఆర్.పి. పట్నాయక్‌తో పాటు 'ఏంజెల్' చిత్రంలో నటించిన నాగాన్వేష్, హెబ్బాపటేల్‌లు కూడా పాల్గొని డ్రా తీశారు. ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ, ఇళయరాజా ఉన్న కాలంలోనే మనం ఉండటం అదృష్టం. అది కూడా మనందరి ముందు లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడం మరింత అదృష్టం. సంగీత దేవుణ్ని చూడాలంటే ఆయన షోకి రండి. ఆయన ట్యూన్ అందించిన 'చిరుగాలి వీచెనే' పాటను నేను పాడటం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకొచ్చాడు.
ఇక 'ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు' చిత్రంలో బాలనటునిగా, 'వినవయ్యా రామయ్య', 'ఏంజెల్' చిత్రం హీరో నాగాన్వేష్ మాట్లాడుతూ, ఇళయరాజాగారు స్వరపరిచిన 'రుద్రవీణ' చిత్రంలోని 'తరలి రాదా...తనే వసంతం' అనే పాట తనకు ఫేవరేట్ సాంగ్ అని, ఆ పాట ఎక్కడ వినిపించినా మైమర్చిపోతానని అన్నాడు. మీరు ఈ షోకి ఇంట్లో ఇల్లాలికి, వంటింట్లో ప్రియురాలికి రెండు టిక్కెట్లు మాత్రమే ఉండి మీకు లేకపోతే ఏమి చేస్తారు? అని ప్రశ్నిస్తే నాగాన్వేష్ వారిద్దరికి టిక్కెట్లు ఇచ్చి ఆ లైవ్‌షోకి పంపి తాను ఇంట్లో ఉంటానని జోక్ పేల్చాడు. మరి ఇంతకీ ఈ లైవ్‌షోకి ఇళయరాజాతో ఈమధ్య కాస్త విబేధాలు సంభవించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వస్తాడో లేదో చూడాలి....!