నేడు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, పార్టీ మధ్య వచ్చే ఉద్రిక్తల కన్నా, ఫ్యాక్షన్ రాజకీయాల కన్నా, సినిమా హీరోల అభిమానుల మద్య జరిగే గొడవలే అందరికీ భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఏ హీరో అభిమానులు ఆ హీరోని పూజించడం, కొలవడం, అభిమానించడం వరకు ఫర్వాలేదు. కానీ ఇతర హీరోలను కూడా వాటిలోకి లాగి వారిని అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. ఇక సినిమా హీరోలకు లేని గొడవలను వీరు తమ మద్య సృష్టించుకుని, కలెక్షన్ల పేరుతో, కులాల పేరుతో పరిశ్రమకే చెడ్డపేరు తెస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలోని వారికి, మరీ ముఖ్యంగా రచయితలు, దర్శకులు, నిర్మాతల నుంచి సాంకేతికనిపుణులు, సపోర్టింగ్ నటులు, హాస్యనటులు.. ఇలా వీరికి మాత్రం అందరికీ కావాలి. అదే విషయాన్ని సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ప్రస్తావించారు.
సోషల్ మీడియా ద్వారా తమకొస్తున్న నోటిఫికేషన్లను గమనిస్తున్నానని, ఈ సందర్భంగా తన 'పరుచూరి పలుకులు' వీక్షించే వారికి ఓ విషయం చెప్పదలుచుకున్నానని చెబుతూ ఆయన ఈ విధంగా స్పందించారు. 'మహాభారతాన్ని నేను పదిసార్లు చదివాను. దానిలోని కొన్ని వ్యాక్యాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఎవరి మూలంగా నువ్వు పైకి వచ్చావో...ఎవరి ద్వారా నీవు సాయం పొందావో.. అలాంటి వాళ్లని కనుక మర్చిపోతే, నువ్వు చనిపోయిన తర్వాత నీ శవాన్ని కుక్క కూడా తినదు'... అనేది దాని సారాంశం. మా విషయానికి వస్తే ఇండస్ట్రీలోని ఆయా హీరోలందరూ మాకు ఏదో రకంగా సాయపడిన వారే. కాబట్టే వాళ్ల యొక్క గొప్పతనాలను మీతో పంచుకుంటున్నాను.
మిత్రుల్లారా, స్నేహితులారా, సన్నిహితులారా, ఆత్మీయురాలా, విద్యార్ధుల్లారా, యువతీ యువకుల్లారా...! మీరు పరుచూరి పలుకులకు స్పందించకపోయినా ఫర్వాలేదు. నేనేమీ బాధపడను. కానీ ఒక హీరో అభిమానులు మరో హీరో అభిమానులు దయచేసి కామెంట్లు పెట్టవద్దు. ముఖ్యంగా ఆ కామెంట్స్‌ని మా చానెల్‌లో మాత్రం పెట్టకండి...! ఇది నా విన్నపం. ఎందుకంటే అందరి హీరోల మీదా మాకు గౌరవ భావం ఉంది. మీరు కూడా అదే గౌరవ భావంతో ఉండండి.. అంటూ ఆయన కోరారు. నిజమే నాటి ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు, అక్కినేని నుంచి చిరంజీవి వరకు వారికి అందరు హీరోలు కావాల్సిన వారే. వారు అవకాశాలిస్తేనే వీరికి ఈ పేరు ప్రఖ్యాతులు, కీర్తిప్రతిష్టలు, డబ్బు వంటివి వచ్చాయి. ఇవి ఏ ఒక్క హీరో వలనే రాలేదు. అందరితో పనిచేయడం ద్వారానే వారికి లైఫ్ వచ్చింది.