మలయాళంలో 'ప్రేమమ్'లో నటించిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ కోలీవుడ్‌లో 'కోడి' చిత్రంలో ధనుష్ పక్కన హీరోయిన్‌గా నటించింది. మరోవైపు ఆ వెంటనే తెలుగు 'ప్రేమమ్' రీమేక్‌లో అవకాశం వచ్చింది. ఇక ఈమె నటించిన 'అ..ఆ, శతమానం భవతి'తో పాటు తాజాగా వచ్చిన 'ఉన్నది ఒకటే జిందగీ' కూడా నటిగా ఈమెకు మంచి గుర్తింపును తెచ్చింది. మరోవైపు 'ప్రేమమ్' తర్వాత నాగచైతన్యతో మరోసారి 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తోంది. కోలీవుడ్‌లో కూడా మరోసారి ధనుష్‌తో 'మారి 2 'లో అవకాశం అందుకుంది. అలాగే నాని - మేర్లపాక గాంధీల 'కృష్ణార్జున యుద్దం' లో కూడా నటిస్తోంది. దీంతో ఈమె ఇప్పటివరకు మలయాళం, తమిళం, తెలుగు పరిశ్రమలను చుట్టేసింది.
మరోవైపు ఆమె కన్నడలో ఎంట్రీ ఇస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న 'వేటగాడు' చిత్రంలో నటిస్తోంది. దీంతో ఈ కేరళకుట్టి దక్షిణాది భాషలన్నింటిని చుట్టేసినట్లయింది. ఇక ఈమెకు కారు కూడా లేదు. మీరు కారెప్పుడు కొంటారు? అని ప్రశ్నిస్తే... తనకు కారే లేదని, ఆ ఆలోచన కూడా లేదని చెప్పింది. తాను మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, తన చిన్నప్పుడు నాన్నగారి జీతం ఇంటి ఖర్చులు, నా స్కూల్ ఫీజులకే సరిపోయేవని తెలిపింది. ఇప్పటికీ నాన్నగారు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారని, నిజంగా భవిష్యత్తులో అవసరమైతేనే కారు గురించి ఆలోచిస్తానని, తాను నటిగా సాధించింది పెద్దగా ఏమీ లేదని, తనది చిన్న జర్నీనేనని, భవిష్యత్తులో ఎంతో పయనించాల్సి ఉందని, విభిన్న చిత్రాలలో నటించి పేరు తెచ్చుకోవాలనేది తన ఆశగా చెప్పింది.
ఇక ఈమె ఇప్పటికే తెలుగును గలగలా మాట్లాడుతూ, తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంటోంది. ఇక ఈమె తెలుగు భాషనే కాదు.. మన తెలుగు రాష్ట్రాలలోని యాసలను కూడా నేర్చేసుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గోదావరియాసతో మాట్లాడి ఆశ్యర్యపరిచింది. తాను ఆ యాసను ఈజీగా నేర్చుకున్నానని, దానికి కారణం అక్కడి యాస తనకు నచ్చడమేనని, కోనసీమలో ఉంటే కేరళలోని కొబ్బరిచెట్ల మద్య ఉన్నట్లే ఉంటుందని, ఇక గోదావరి వంటకాలంటే తనకెంతో ఇష్టం ఏర్పడిందని చెప్పింది. ఇక తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, కాలేజీ రోజుల్లో సిటీ బస్సులలో ఎక్కితే మగాళ్లు కావాలని తాకడం, తాకరానిచోట్ల చేతులు వేయడం వంటివి ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.