విజయ్‌దేవరకొండకి 'పెళ్లిచూపులు' మంచి గుర్తింపును తెచ్చి, విజయాన్ని అందించిన మాట నిజమేగానీ ఆయనలోని నటుడిని బయటకు తీసి, ఆయనను యూత్ ఐకాన్‌గా, తెలంగాణ పవర్‌స్టార్ అనిపించేలా ఆకట్టుకున్న చిత్రం మాత్రం 'అర్జున్‌రెడ్డి'నే. ఈయన పేరు పూర్తిగా తెలియని వారు కూడా అర్జున్‌రెడ్డి అంటే గుర్తుపట్టేస్తారు. నాగార్జునకి ఓ 'శివ'లా ఈ చిత్రం విజయ్‌దేవరకొండ ఇమేజ్‌నే పెంచేసి ఓవర్‌నైట్ స్టార్‌ని చేసిన చిత్రం ఇదే. ఇక ఈ చిత్రం అంతబాగా రావడానికి విజయ్ నటన, హీరోయిన్ టాలెంట్, మరీ ముఖ్యంగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా క్రియేటివిటీ ముఖ్యకారణం. ఈ కథను దర్శకుడు తీసిన విధానం, స్క్రిప్ట్‌ని, క్యారెక్టర్లలను, వారి హావభావాలను, ప్రతి పాత్రని ఆయన తీర్చిదిద్దినతీరు అద్భుతమనే చెప్పాలి. ఈ చిత్రం మంచి చిత్రం కాదనే వారు ఉంటారేమో గానీ విజయ్, షాలిని పాండే, దర్శకుడు సందీప్‌రెడ్డిల కృషిని, కొత్తదనం అందించాలనే తపనను మాత్రం ఎవ్వరు కాదనలేరు. ఎలా తీసుకున్నా, చిత్రంలో ఎంత మంచి ఎంత చెడు అనే విషయాన్ని పక్కనపెడితే ఈ చిత్రం ఓ ట్రెండ్‌సెట్టర్.
5కోట్లతో రూపొందిన ఈచిత్రం 50కోట్లు వసూలు చేసిందంటే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అంతగా ఆదరించడమే కారణం. ఇక ఈ చిత్రం కథను సందీప్ చెప్పిన వెంటనే ఆ అర్జున్‌రెడ్డి పాత్రలో తనను తాను అలా ఊహించుకున్నాడట విజయ్. ఆ పాత్ర ఎందుకు అలా తయారైంది..? ఎందుకు అలా మారింది? అలాంటి పరిస్థితులు వస్తే ఎలా బిహేవ్ చేయాలి? అనేవి అన్నింటినీ ఊహించుకుని, దర్శకుడు చెప్పింది వినబట్టే తాను ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలిగానని విజయ్ చెబుతున్నాడు.
ఈ చిత్రం కథ విన్న తర్వాతి నుంచి విజయ్ కామెడీ చిత్రాలు, సున్నితమైన ఎమోషన్స్ వంటి చిత్రాలు అసలు చూడలేదట. కేవలం డార్క్ సినిమాలనే చూస్తూ తనని తాను ఆయా పాత్రల్లోని నటనను ఆకళింపు చేసుకున్నానని, దర్శకుడి సృజనాత్మకతే ఈ చిత్రం అంత బాగా రావడానికి కారణమని విజయ్ అంటున్నాడు. దర్శకుడు చెప్పినట్లే గెటప్ నుంచి భావోద్వేగాల వరకు మార్చుకున్నానని ఆయన చెబుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడేళ్లకి సరిపడా చిత్రాలు ఉన్నాయంటే అది 'అర్జున్‌రెడ్డి' పాత్రే కారణం. ఇక దర్శకుడు సందీప్‌వంగా తదుపరి చిత్రం కోసం కూడా ఎందరో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.