రాశీఖన్నా హీరోయిన్ గా, సింగర్ గా టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు చిన్న చితక హీరోలతో సరిపెట్టుకున్న రాశి ఖన్నా మొదటిసారి ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో పక్కన 'జై లవ కుశ'లో నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించినా.. రాశికి మాత్రం పెద్దగా పేరు రాలేదు. ఎంతగా గ్లామర్ షో చేసినా.. అమ్మడుకి తగిన అవకాశాలే కాకుండా.. ఓ.. అనంత హిట్ కూడా పడడం లేదు. అయితే రాశీఖన్నా టాలీవుడ్ లో మంచి ప్రశంసలు అందుకోలేకపోయినా పరభాషా అయిన మలయాళంలో మాత్రం ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తుంది. కేవలం ప్రశంసలే కాదు బోలెడు అవకాశాలు కూడా పట్టేస్తోంది.
రాశీఖన్నా మలయాళంలో మోహన్ లాల్, విశాల్, హన్సిక వంటి స్టార్స్ పక్కన 'విలన్' సినిమాలో నటించింది. ఆ సినిమా మలయాళంలో గత శుక్రవారం భారీ రేంజ్ లో విడుదలైంది. సినిమా విడుదలైన మొదటి షో నుండే ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఒక్క షోకే హిట్ టాక్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ దిశగా పరుగులు తీస్తుంది. ఇక ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆ సినిమాలో నటించిన నటీనటుల ఆనందానికి అవధులే లేవు. అందరిలో రాశి ఖన్నా మాత్రం బాగా సంతోషపడిపోతుంది.
మలయాళంలో మొదటి ప్రయత్నమే ఇంతటి సక్సెస్ అయినందుకు రాశీఖన్నా తెగ ఇదైపోతూ.... ‘సుప్రీమ్’ తర్వాత నాకు పెర్ఫార్మెన్స్ పరంగా అంతటి పేరు తీసుకొచ్చిన చిత్రం ఇదేనని చెబుతుంది. అలాగే తన మొదటి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ విజయం సమయంలో ఎలాంటి ఆనందం కలిగిందో ఇప్పుడు కూడా అదే ఆనందం కలుగుతుందని, డైలాగ్స్ పరంగా, లుక్ పరంగా అందరూ బాగా ఇంప్రెస్ అయ్యారని... అక్కడ మలయాళం లో మంచి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్పేస్తూ తెగ ఆనందపడిపోతుంది.