ఏపీ మంత్రి గంటాశ్రీనివాసరావుకి సినిమాలన్నా, సినీ సెలబ్రిటీలన్నా ఎంతో పిచ్చి. ఆయన తాను హీరోని కావాలని భావించానని, కానీ అది నెరవేరలేదని, ఆ కోరికను తన కుమారుడు గంటా రవిని హీరోని చేయడం ద్వారా తీర్చుకుంటున్నానని, తన కుమారుడు హీరోగా తెరంగేట్రం చేసిన 'జయదేవ్' సినిమా సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమా వేడుకకు ముఖ్యఅతిధిగా వచ్చిన చిరంజీవి కూడా గంటా రవినే కాదు గంటా శ్రీనివాసరావు కూడా హీరోలా ఉన్నాడని వ్యాఖ్యానించాడు. ఇక ఈయన మంత్రి అయినా కూడా బయటికి వచ్చేటప్పుడు సినీ నటులలాగానే మేకప్ వేసుకుని వస్తాడని, ఈయన సినీ బూచోడని కూడా సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతుంటాయి.
ఇక తనకు మెగా, అల్లు ఫ్యామిలీలతో ఉన్న సాన్నిహిత్యంతో గంటారవి రెండో చిత్రాన్ని మారుతి చేతిలో పెట్టాలని ఒత్తిడి తెస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా తన మేకప్, తన కుమారుడిని సినీ హీరోగా నిలబెట్టడంతోనే ఆయన సమయం అంతా సరిపోతోంది. పైగా ఆయన నిర్వహిస్తున్న విద్యా శాఖకు, ఆయనకు వియ్యంకుడైన నారాయణ సంస్థల అధినేత నారాయణకు ఉన్న అనుబంధం దృష్ట్యానే నారాయణ విద్యాసంస్థలో జరుగుతున్న అక్రమాలు, విద్యార్ధుల ఆత్మహత్యలను కూడా గంటా చూసిచూడనట్లుగా ఉంటున్నాడని తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అదే పాయింట్ మీద వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి గంటాపైఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆమె మాట్లాడుతూ, 'గంటాకి మేకప్ వేసుకోవడానికే సమయం చాలడం లేదు, ఇక ఆయన విద్యార్ధుల సమస్యలను పట్టించుకునే తీరిక ఎక్కడిది. ఎయిడెడ్ కాలేజీలలో పనిచేస్తే పర్మినెంట్ లెక్చరర్లకు కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇచ్చిన జీతంలో సగం కూడా ఇవ్వడం లేదు. ఎయిడెడ్ కాలేజీలలోని ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపుచూస్తోంది. ఎయిడెడ్ కాలేజీలలో పనిచేసే లెక్చరర్లని క్రమబద్దీకరిస్తామని టిడిపి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఆ హామీ ఏమైంది'... అంటూ నిప్పులు చెరిగింది. నిజంగానే లక్ష్మీపార్వతి చెప్పిన మాటలు వాస్తవమేనని పలువురు ఆమెకి మద్దతు ప్రకటిస్తున్నారు.