సినిమా ప్రెస్‌మీట్‌లలో ఒకరిని మించి మరొకరు భజన చేసుకుంటూ అతిశయోక్తులు జోడిస్తూ మాట్లాడుతుంటారు. ప్రస్తుతం బన్నీవాసు ఇదే పనిచేశాడని ఆయన మాటలను వింటుంటే అర్ధమవుతోంది. వి4 బేనర్‌లో ఆది హీరోగా రూపొందిన 'నెక్ట్స్ నువ్వే' చిత్రం రిలీజ్ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో అతిశయోక్తులు జోడించారు. అల్లుఅరవింద్ గారే తమకు ప్రేరణ అని చెప్పడం బాగానే ఉంది కానీ ఏకంగా అల్లుఅరవింద్ గారు 60ఏళ్ల టీనేజర్. ఎవరికైనా టీనేజ్ 19ఏళ్లకే పూర్తవుతుంది. కానీ అల్లుఅరవింద్ గారికి మాత్రం 60ఏళ్లు వచ్చినా టీనేజ్ కొనసాగుతోంది. అల్లుఅరవింద్ వంద పేజీల పుస్తకం. ఆ పుస్తకంలో ఓ ఐదారు పేజీలు కూడా ఎవ్వరూ చదవలేరు. కానీ నేను కాస్త ముందుకెళ్లి 15 పేజీల పైన చదివాను. 60ఏళ్లు దాటినా టీనేజ్‌తోనే ఆయన కంటిన్యూ అవుతున్నారు. అంతటి నిత్య ఉత్సాహంతో ఆయన ముందుకు సాగుతుంటారు.
ఇక గీతాఆర్ట్స్ పెద్ద బేనర్. ఈ పెద్ద బేనర్‌లో కొత్తవారికి పెద్దగా ఛాన్సులు ఇచ్చి సినిమాలను రిస్క్ చేసి నిర్మించలేం. అందుకే వి4 బేనర్‌ని స్థాపించాం. ఈ బేనర్‌లో కొత్తవారిని పరిచయం చేస్తూ, తమ టాలెంట్‌ని వారు ప్రూవ్ చేసుకున్న తర్వాత గీతాఆర్ట్స్‌లో అవకాశాలు ఇస్తాం. రైటర్స్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్ వరకు ప్రతిభ ఉన్నవారందరికీ వి4 బేనర్‌లో అవకాశాలు ఉంటాయి. ఇక 'నెక్ట్స్ నువ్వే' చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ని నమ్మి ఈ చిత్రం చేశాం. నేటి రోజుల్లో ప్రేక్షకులు వినోదాన్ని ఎక్కువగా ఇష్టపడుతుండటంతో వారి అభిరుచికి అనుగుణంగా ఈ చిత్రం నిర్మించాం. ఇక దర్శకుడు ఈటీవీ ప్రభాకర్‌లో మంచి టాలెంట్ ఉంది. ఆయన 'నెక్ట్స్ నువ్వే' చిత్రంలో చూపించిన టాలెంట్‌ని చూసి మారుతి బేనర్‌లో రికమండ్ చేశాం. ఇక మా పార్ట్‌నర్స్ కూడా ఒప్పుకుంటే ప్రభాకర్ మూడో చిత్రాన్ని కూడా మా బేనర్‌లోనే నిర్మిస్తాం. నాకు, ఈ బేనర్‌లో భాగస్వామి అయిన వంశీకి, అల్లుఅరవింద్ గురువు లాంటి వారు. ఈబేనర్‌కి ఆయనే పెద్దదిక్కు.
ఇక నేను పవన్‌కళ్యాణ్ గారికి వీరాభిమానిని. ఆయనతో చిత్రం చేయాలనేది నా కోరిక అని తెలిపాడు. మొత్తానికి అల్లుఅరవింద్‌ని పెద్దపెద్ద మహానుబావుల చరిత్రతో పోల్చినట్లు ఆయనది వంద పేజీల పుస్తకమని, అందరూ ఐదారు పేజీల కంటే ఎక్కువ చదవలేరని, కానీ తాను ముందుకెళ్లి పదిహేను పేజీలకు పైగాచదివానని చెప్పడం, ఆయన ఇంకా టీనేజర్ అని చెబుతుండటం చూస్తుంటే అల్లుఅరవింద్‌ని కూడా న్యూటాలెంట్‌గా భావించి వి4 బేనర్‌లో హీరోగా పరిచయం చేస్తాడేమోనని, అలా చేస్తే అల్లు ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలకు ఆయన పోటీ అవుతాడనే సెటైర్లు వినిపిస్తున్నాయి.