మనదేశంలో ఎంత స్వతంత్ర వ్యవస్థ అయినా, రాజకీయాలకు సంబంధం లేని శాఖలు కూడా స్వతంత్ర్యంగా నడవవని అధికారం ఉండే వారి ఇస్టానుసారమే పనిచేస్తారని చాలా మంది భావిస్తారు. ఎన్నికల కమిషన్, కోర్టులు, సెన్సార్‌బోర్డ్‌లు, అవినీతి నిరోధకశాఖలు, ఐటీ శాఖలు కూడా ప్రభుత్వ కనుసన్నలలోనే నడుస్తాయి. పెద్దనోట్ల రద్దు వ్యవహారం రిజర్వ్‌బ్యాంక్‌దే అయినా వారు మోదీ ఇష్టానుసారమే చేశారు. సిబిఐ అంటే నాడు కాంగ్రెస్ బ్యూరోఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ అని జోకులు కూడా వచ్చేవి. ఇటీవల 'మెర్సల్'కి మద్దతుగా నిలిచినందుకు విశాల్ ఆఫీసులపై ఐటీశాఖ అధికారులు దాడులు చేసి 51లక్షలు కట్టాలంటూ ఆఘమేఘాల మీద నోటీసులు ఇచ్చారు. విశాల్‌తోపాటు మీడియా కూడా ఈ దాడులు నిజమే అని చెబుతుంటే, జీఎస్టీ ఇంటెలిజన్స్, ఐటిఅధికారులు మాకేపాపం తెలియదంటున్నారు.
ఇక విషయానికి వస్తే నిన్ననే 'మెర్సల్' చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల కావాలి. మంచి స్థితిమంతుడు, పలుకుబడి ఉన్న శరత్‌మరార్ ఈ చిత్రం డబ్బింగ్‌కి రెడీ చేసి, థియేటర్లను బుక్ చేసి, అడ్వాన్స్‌లు ఇచ్చి, ఆన్‌లైన్‌లో టిక్కెట్లను కూడా విక్రయించారు. కానీ ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. ఇందులోని జీఎస్టీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి, వైద్యులపై పేల్చిన వ్యంగ్యాస్త్రాలను తీసివేస్తే కానీ సెన్సార్ చేస్తామని సెన్సార్ బోర్డ్ చెప్పిందని, కానీ తాము ఒప్పుకోక పోవడం వల్ల సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి క్లియరెన్స్ ఇవ్వలేదని నిర్మాతలు అంటున్నారు.
కానీ సిబిఎఫ్‌సి చీఫ్ ప్రసూన్ జోషి మాత్రం మేము సింగిల్ కట్ లేకుండా చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చాం. మరి ఎందుకు వాయిదా పడిందో మాకు తెలియదు. వాయిదాకి మేమే కారణమని చెబుతున్న నిర్మాతలపై ఆయన విరుచుకుపడ్డారు. మరి ఈ విషయంలో నిర్మాతలు అబద్దం చెప్పారా? లేక సీబీఎఫ్‌సి చీఫ్ అబద్దం చెప్పాడా? ఇప్పటికే తెలుగు వెర్షన్ రాకపోవడంతో ఈ చిత్రంలో కేంద్రంపై ఎలాంటి సెటైర్స్ ఉన్నాయి? డాక్టర్ల వివాదానికి కారణం ఏమిటో అని ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. చాలా చోట్ల థియేటర్లలో 'మెర్సల్' తమిళ చిత్రాన్నే విడుదల చేశారు. దీంతో ఉత్సుకత ఆపుకోలేని వారు తమిళ్ చిత్రాలన్నీ థియేటర్లలో, పైరసీలో చూస్తున్నారు. దీంతో కోట్లు ఖర్చుపెట్టిన వారికి ఇది పెద్ద నష్టమేనని చెప్పాలి.