తమిళంలో 'రాజా రాణి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు అట్లీ. తమిళంలో తెరకెక్కిన ఆ సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించి, ఇక్కడ తెలుగులో కూడా విడుదలై దర్శకుడు అట్లీకి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమా తరువాత అట్లీ తమిళ స్టార్ హీరో అయిన విజయ్ తో 'తేరి' అనే సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమా కూడా తమిళ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కురిపించింది. 'తేరి' సినిమాతో అట్లీ.. స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఇక టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆ సినిమాని తెలుగులో 'పోలీసోడు' అనే టైటిల్ తో డబ్ చేసి రిలీజ్ చేశాడు.
ఇక ఇప్పుడు తాజాగా అట్లీ తమిళంలో విజయ్, సమంత, కాజల్, నిత్యా మీనన్ లతో 'మెర్సల్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఇక తమిళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'మెర్సల్' సినిమా మిశ్రమ స్పందనతో... ఏకంగా ఒక వారంలోనే 170 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అదరహో అనిపించింది. కానీ సినిమా విడుదలైనప్పటి నుండి రాజకీయ చదరంగంలో పావుగా మారి నిత్యం వార్తల్లో ఉంది. ఆ చదరంగంలో పావుగా మారినా కూడా సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ కన్నా ఎక్కువ రావడంతో సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం దర్శకుడు అట్లీ 'మెర్సల్' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
విజయ్ తో తీసిన రెండో సినిమానే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంటే.. సినిమాని తెరకెక్కించిన ఆ దర్శకుడు ఫుల్ ఖుషిగానే ఉంటాడు మరి. ఇక ఈ సినిమాని కూడా తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదల చేస్తున్నారు. అయితే ఈ 'మెర్సల్' సినిమా తర్వాత అట్లీ ఒక తెలుగు సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇదివరకే అట్లీ తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లకి కథని వినిపించాడనే టాక్ ఉంది. మరి అట్లీ తెలుగులో తెరకెక్కించబోయే ఈ సినిమాలో ఏ స్టార్ట్ హీరో నటిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.