తమిళనాట విజయ ఢంకా మోగించిన 'మెర్సెల్' చిత్రం ఇక్కడ తెలుగులో 'అదిరింది' పేరుతొ డబ్ చేశారు. విజయ్, సమంత, కాజల్, నిత్య మీనన్ లు నటించిన ఈ సినిమా తమిళనాట కాంట్రవర్సీల కారణంగా సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే తమిళంలో విడుదల రోజునే తెలుగులోనూ 'అదిరింది' సినిమా విడుదల కావాల్సి ఉండగా... ఇక్కడ తెలుగు సెన్సార్ కాకపోవడం కారణంగా ఈ రోజు శుక్రవారానికి వాయిదా పడింది. అయితే ఈ రోజు శుక్రవారం రామ్ సినిమా 'ఉన్నది ఒకటే జిందగీ' కి పోటీగా విడుదల కావాల్సిన విజయ్ 'అదిరింది' సినిమా ఈ రోజు కూడా ప్రేక్షకుల ముందు రాలేదు.
ఇక్కడ తెలుగులో 'అదిరింది' సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నప్పటికీ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. అయితే తెలుగు 'అదిరింది' సినిమాకి ఇక్కడ హైదరాబాద్ లో సెన్సార్ జరగాల్సింది అక్కడ చెన్నై లో సెన్సార్ జరగడం... ఇక్కడ తెలుగు నిర్మాత శరత్ మరార్ కి ఆ సెన్సార్ కాపీ అందకపోవడమేకాకుండా... తమిళంలో 'మెర్సల్' నిర్మాతల నుండి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ఇక్కడ తెలుగునాట 'అదిరింది' బొమ్మ పడలేదు. మరి వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమా తెలుగులో ఎటువంటి ప్రభంజనం సృష్టిస్తుంది అనేది వచ్చే శుక్రవారం అంటే నవంబర్ 3 న అయినా తెలుస్తుందో లేదో కాస్త సస్పెన్స్.
ఇక తమిళంలో మాత్రం 'మెర్సల్' కి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అక్కడ సినిమా మాత్రం కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. రాజకీయ పార్టీల ఫ్రీ పబ్లిసిటీతో సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయ్