తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా 'మెర్శల్' చిత్రం సంచలనం సృష్టిస్తోంది. ఇందులో జీఎస్టీమీద, డిజిటల్ ఇండియా, డీమానిటైజేషన్ వంటి వాటిపై వేసిన చురకలను బిజెపి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ఈ చిత్రానికి బిజెపి మినహా తమిళనాడులోని అన్నిరాజకీయపార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇక కేంద్ర స్థాయిలో కాంగ్రెస్, ఇతర యూపీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి రాహుల్‌గాంధీ వరకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇంతకాలంగా ముఠాకక్ష్యలతో వివిధ వర్గాలుగా చీలిపోయిన రజనీకాంత్, కమల్‌హాసన్, రంజిత్‌పాతో పాటు బాలీవుడ్ ప్రముఖులు, తెలుగులో మంచు విష్ణు వంటి వారు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు. సినిమా వారికి నాలెడ్జ్ ఉండదని, మిడి మిడి జ్ఞానంతో బుర్ర తక్కువ చిత్రాలు తీస్తారని బిజెపి అధికార ప్రతినిధి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై అన్నిఇండస్ట్రీలు మండిపడుతున్నాయి.
ఇక ఈ చిత్రం విషయంలో జరుగుతున్న పరిణామాలను గమనించిన ప్రముఖ ఛాయగ్రాహకుడు సంతోష్ శివన్.. మోదీ ప్రభుత్వంపై వ్యంగ్యంగా చేసిన ట్వీట్స్ బాగా వైరల్ అవుతోంది. ఆయన తన ట్వీట్‌లో ఇప్పటికే మనం సినిమా తెరలపై సిగరెట్ ఆర్యోగానికి హానికరం.. మద్యం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు కల్పితాలు, ఈ చిత్రంలో నిజమైన జంతువులను వాడలేదు.. వాటిని హింసించలేదు.. అని వార్నింగ్‌లు వేసినట్లుగానే ఇకపై 'ఈ చిత్రంలో మేము ఏ ప్రభుత్వాన్ని కించపరచలేదు..గాయపరచలేదు' అనే స్టాట్యుటరీ వార్నింగ్‌లు వేయాల్సిన దుస్థితి వచ్చిందని సెటైర్లు వేశాడు.
నిజమే వాక్‌స్వాతంత్య్రం లేని దేశంలో, ఎవరి అభిప్రాయాలనైనా ప్రజల క్షేమం దృష్ట్యా సినిమాలలో చూపించే సన్నివేశాలు, డైలాగ్‌లను కూడా నిర్మాతలను బెదిరించి వాటిని తీసివేయమని చెప్పడం, సినిమాకి మద్దతు తెలిపినందుకు హీరో విశాల్‌కి చెందిన నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు సోదా చేసి మరీ చేయలేదని చెప్పడం, కానీ విశాల్ మాత్రం నిజంగానే దాడులు జరిగాయని ప్రకటించడం చూస్తే కనీస విమర్శలను కూడా ప్రభుత్వాలు భరించలేక పోతున్నాయని చెప్పకతప్పదు.