వచ్చేనెల 2 నుంచి జగన్ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నాడు. కోర్టు ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకి హాజరుకావాల్సిందే అని ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్లబోతున్నాడు. మరి ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకి హాజరుకావాలంటే గురువారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు రాకపోకలు, కోర్టు సమస్యలతోనే గడిచిపోతుంది. దీంతో ఆయన పాదయాత్ర కాస్తా కామెడీ అయిపోతుంది. మరోవైపు తెలుగుదేశం ఆయనను ఇబ్బంది పెట్టడానికే ఆగష్టులో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను, వచ్చే నెల 10 నుంచి చేపట్టనుంది. అదే సమయంలో జగన్ పాదయాత్ర చేస్తే పదును లోపిస్తుంది. ఇక తన శాసనసభ్యులను అసెంబ్లీకి హాజరుకావాలని చెప్పినా, లేక గైర్హాజర్ కావాలని నిర్ణయించుకున్నా ఎటు చూసినా జగన్‌కి సెల్ఫ్‌గోల్ తప్పదేమోనని విమర్శకులు అంటున్నారు.
ఇక జగన్ పాదయాత్ర చేపడితే దానికి ఓ నెలరోజుల లోపలే జనసేనాధిపతి పవన్ యాత్ర చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఇది చంద్రబాబు ఎత్తుగడ అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం పవన్ యాత్రలకు సుముఖమేనని ఎప్పుడో చెప్పాడని, అక్టోబర్ నుంచి రాజకీయాలలోకి పూర్తిగా ప్రవేశించిన తర్వాత యాత్ర గురించిఆలోచిస్తానని నాడే స్పష్టం చేశాడని అంటున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే ఆయనకు ఆర్ధికబలం ఉంది. మీడియా చేతుల్లోనే ఉంది. అందునా పూర్తి సమయంలో రాజకీయాలలోనే ఉన్నాడు.తన తండ్రి పుణ్యమా అని అనుచరగణం, సంస్థాగత పటిష్టత, కార్యకర్తలు, ఎమ్మెల్యీలు, ఎంపీలు ఇలా అందరూ ఉన్నారు. కానీ వైసీపీతో పోల్చుకుంటే ఇంకా జనసేనది తప్పటడుగులే. పవన్‌కి యాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి కావాల్సిన ఆర్ధికస్తోమత ఉందని అనుకోలేం. ఇక ఆయనకు అభిమానులు, వ్యక్తిగతంగా అభిమానించే వారు ఉన్నారు గానీ గ్రామస్థాయి నుంచి సంస్థాగత ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. సంస్థాగత ఏర్పాట్లు, పటిష్టత, పార్టీ విస్తరణపై ఆయనకు దృష్టి పెట్టడానికే సమయం మించి పోతుంది. ఇంకా ఆయన త్రివిక్రమ్ చిత్రం కూడా ఇంకా పూర్తి చేయలేదు.
ఇక పవన్‌కి తలనొప్పి తన ఇంటి నుంచే మొదలవుతుంది. తన అన్నయ్య చిరంజీవి రాజకీయాలలోకి ఎంటర్ అయినప్పుడు కాంగ్రెస్‌లో విలీనం కాకుండా తన పీఆర్పీనే సంస్థాగతంగా పటిష్టం చేసి ఉంటే అది చిరుకి కాకపోయినా కనీసం పవన్‌కి ఉపయోగపడేది. ఇక పవన్‌కి తన సంపాదన తప్ప ఇతర మార్గాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ఆయన పార్టీ అధికార ప్రతినిధి కళ్యాణ్ సుంకర చీటింగ్ కేసులో అరెస్ట్ కావడం ఆయన ఇమేజ్‌ని దెబ్బతీసేదే. ఇక తాను జనసేన ప్రారంభంలో 'ఇజం' పుస్తకం రాయడంలో కీలక పాత్ర పోషించిన రాజు రవితేజ చాలా కాలంగా పవన్‌కి దూరంగా ఉంటున్నాడు. తాజాగా జనసేన విడుదల చేసిన వీడియాలో ఆయన పవన్ పక్కన ఉన్నాడు. ఆయన సలహాలే ఈ యాత్రకు కారణమా? అనే సంశంయతో పాటు వెనుక చంద్రబాబు ఉన్నాడా? అనే అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి.