శంకర్ - రజినీకాంత్ కలయికలో తెరకెక్కిన '2.0' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ప్రస్తుతం పబ్లిసిటీ కార్యక్రమాల్లో కూడా బిజీగా వున్న '2.0' చిత్ర బృందం... '2.0' ఆడియో వేడుకని ఈ నెల 27 న దుబాయ్ లో నిర్వహించనుంది. ఈ ఆడియో వేడుక దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో అంగరంగ వైభవంగా జరపడానికి చిత్ర బృందం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. '2.0' సినిమా కోసమే భారీ బడ్జెట్ ని వెచ్చించిన లైకా ప్రొడక్షన్స్ వారు పబ్లిసిటీ విషయంలోనూ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఆడియో వేడుకకు దాదాపు 10 కోట్లపైనే ఖర్చు పెడుతున్నారు.
ఈ వేడుక కోసం ఇండియా నుండి వెళ్లబోయే చిత్ర బృందంతోపాటు... ఈ వేడుక కోసం విచ్చేస్తున్న ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక భారీ ఏర్పాట్లతోపాటే శంకర్ తన సినిమా ఆడియో వేడుకలకి ఒక పెద్ద స్టార్ ని ఆహ్వానిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు శంకర్ తన '2.0' సినిమా కోసం ఏ స్టార్ ని పిలవబోతున్నాడో అనే విషయంపైన సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఈ '2.0' వేడుకకి శంకర్ కి కావాల్సిన వ్యక్తి... అలాగే హీరో రజినీకాంత్ క్లోజ్ ఫ్రెండ్... విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా దుబాయ్ కి రాబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
అయితే '2.0' ఆడియో వేదిక మీద '2.0' మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ లైవ్ పెరఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. ఇకపొతే రజినీకి స్నేహితుడు.. శంకర్ నెక్స్ట్ మూవీ ఇండియన్ 2 హీరో కమల్ హాసన్ కావడంతోనే ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయో.. లేకపోతే నిజంగానే కమల్ హాసన్ దుబాయ్ కి '2.0' ఆడియో సిడి ని రిలీజ్ చెయ్యడానికి వెళుతున్నాడో అనే విషయాన్ని '2.0' చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.