దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ కనివిని ఎరుగని రీతిలో కాంగ్రెస్‌పార్టీ అతి ఎక్కువకాలం అధికారంలో ఉంది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ల హయాంలో మంచి సంస్కరణలు, కంప్యూటీకరణకు మార్గాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, ప్రపంచీకరణ, సమాచార హక్కు చట్టం వంటి మంచి పనులు జరిగినా అనుకున్న స్థాయిలో అభివృద్ది జరగని మాట వాస్తవం. మనకన్నా తర్వాత సాతంత్య్రం పొందిన దేశాలు, ప్రపంచయుద్దంలో హీరోషిమా, నాగసాకీలతో తీవ్ర కష్టాలు పడిన జపాన్ వంటి దేశాలు అభివృద్ది పథంలో నడుస్తుంటే మనం మాత్రం వెనుకబడిన దేశం అని నామోషీగా చెప్పుకోలేక, అభివృద్ది చెందుతున్న దేశంగా భావిస్తూ వచ్చాం. ఇక యూపీఏ అస్తవ్యస్త పాలనను వ్యతిరేకిస్తూ మొట్టమొదటి సారిగా దేశప్రజలందరూ మోదీ అయితేనే దేశాన్ని బాగు చేయగలడని భావించి ఆయన పార్టీకి ఎదురులేని మెజార్టీ ఇచ్చారు.
ఇక ఈ మూడున్నర ఏళ్ల కాలంలో మోదీ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. జీఎస్టీ, మేకిన్ ఇండియా, స్వచ్చభారత్, డీమానిటైజేషన్ పేరుతో తాననుకున్నవన్నీ చేస్తున్నాడు. మరి ఫలితాలు రాబోయే కాలంలో కనిపిస్తాయని అంటున్నాడు. అది నిజమో కాదో రాబోయే కాలమే నిరూపించాలి. అయితే ఆయన మాత్రం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజుల్లో వ్యవహరించిన నియంత ధోరణికి మించి ప్రజలకు, మీడియాకు భావ ప్రకటనా స్వేచ్చకు తన చేష్టల ద్వారా అందరినీ భయోపేతులను చేస్తున్నాడు. భావప్రకటనా స్వేచ్చకి అంబేద్కర్ వంటి వారు ప్రాధాన్యం ఇస్తే ఈయన వాటిని కాలరాస్తున్నాడు. ప్రభుత్వంలో రాష్ట్రపతి అభ్యర్థిని, ఉప రాష్ట్రపతి అభ్యర్ధుల నుంచి సోలిసిటర్ జనరల్, కేంద్ర మంత్రులు కూడా మోదీ పర్మిషన్ లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇక మంత్రులైతే తమ స్వంత నిర్ణయం మీద పీఏలను కూడా నియమించుకునే పరిస్థితి లేదు. ఇదంతా ఆయన పార్టీ వ్యవహారం అనుకుంటే.. బెంగుళూరులో జరిగిన జర్నలిస్ట్, ఉద్యమకారిణి గౌరీ లంకేష్ హత్య నుంచి 'మెర్శల్' చిత్రానికి మద్దతు తెలిపినందుకు గాను హీరో విశాల్ ఆఫీస్‌లను జీఎస్టీ ఇంటెలిజన్స్ అధికారులు సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదు.
ఇదే తరహాలో మోదీ ప్రవర్తిస్తూ ఉంటే మనకి మరో బలమైన ప్రతిపక్ష నాయకుడు అవసరమేమో అనే అనుమానం కలుగుతోంది. తాజాగా గుజరాత్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ, జీఎస్టీ అంటే నాటి 'షోలే'ని గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అని, రాత్రికి రాత్రి తనకు నచ్చలేదని పెద్ద నోట్లను రద్దు చేశాడని, ఇది ఫలితాలను ఇవ్వలేదని, ఇంకా చిన్న వ్యాపారులు, చిరు ఉద్యోగుల పొట్టలను కొట్టిందని ఆరోపించాడు. ఆయన ఆరోపణలు వినడానికి బాగా ఉన్నా కాబోయే ప్రదానికి కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తోన్న రాహుల్‌గాంధీలో అంత సత్తా ఉందా? మరో బలమైన నాయకుడు కావాల్సిందేనా? అన్నది కాలమే చెప్పాలి.