తండ్రులకు కుమారులు, సోదరులు, సోదరిమణులు.. ఇలా సినిమా ఫీల్డ్‌లో వారసత్వం సహజమే. గతంలో కూడా కేవలం టాలీవుడ్‌లోనే ఎందరో అక్కాచెల్లెలు రాణించారు. మరికొందరు రాణించలేకపోయారు. స్టార్స్ అయిన తమ సోదరీమణుల నీడలోనే వారికి సోదరీమణులుగానే గుర్తింపు తెచ్చుకున్నారు తప్ప ఓన్ ఐడెంటిటీ సాధించలేకపోయారు. ఇక ఇలాంటి వారిలో నేడు హాలీవుడ్, బాలీవుడ్‌ని ఏలుతున్న ప్రియాంకాచోప్రా సోదరి పరిణితి చోప్రా కూడా వుంది. 2011లో వచ్చిన 'లేడీస్ వర్సెస్ విక్కీ బెహల్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత 'హస్సీతో ఫస్సీ, ఇష్క్ జాదే' తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెండేళ్ల గ్యాప్ తీసుకుని 'మేరీ ప్యారీ బిందు'తో రీఎంట్రీ ఇచ్చింది.
ఈమె నటించిన 'గోల్‌మాల్ ఎగైన్' చిత్రం తాజాగా విడుదలైంది. త్వరలో 29వ వసంతంలోకి అడుగుపెడుతోన్న ఆమె తన స్నేహితులతో పాటు సన్నిహితులందరినీ గోవా పిలిచి గ్రాండ్ పార్టీ ఇవ్వనుంది. ఈమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ, ప్రియాంకా చోప్రా, నేను ఇద్దరం సోదరీమణులమే కాదు.. ఆమెతో పాటు నేను కూడా నటినే. నాకంటూ ఓ గుర్తింపు ఉంది. కెరీర్ ప్రారంభంలో వైవిధ్యభరితమైన రిస్కీ పాత్రలు చేయడం వల్లే ఈరోజు నాకు ఆ పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఇప్పటికీ నన్ను ప్రియాంకా సోదరిగా చూడటం సరికాదు. రాబోయే రోజుల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని ప్రియాంకా సిస్టర్ అనే ట్యాగ్‌ని వదిలేసుకుంటాను.
అలాగని ప్రియాంకాపై నాకు ద్వేషం లేదు. సినిమా ఫీల్డ్‌లోకి వచ్చిన మొదట్లోనే ఆమె నాకు.. నటిగా నీ గుర్తింపును నీవు పొంది... సొంతగా ఐడెంటిటీ తెచ్చుకోమని చెప్పింది... అంటూనే ప్రియాంకా సోదరిగా తనను పిలవడం, గుర్తించడం మానుకోవాలని ఈమె ఇన్‌డైరెక్ట్‌గా ప్రియాంకాను మెచ్చుకుంటూనే తన ఉద్దేశ్యాన్ని ప్రేక్షకులకు, ఇండస్ట్రీకి, మీడియాకు తెలిపిందని భావించవచ్చు...!