తేజ తన కెరీర్ ప్రారంభంలో కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్‌తో ప్రేమకధా చిత్రాలు తీసి సంచలనం సృష్టించాడు. కానీ పోను పోను ఆయన తానే తీసిన చిత్రాలను కాస్త మార్పులు చేర్పులు, కాస్త అటుది ఇటు ఇటుది అటు మార్చి చిత్రాలు చేస్తుండటంతో ప్రేక్షకులు ఆయన్ని పక్కనపెట్టారు. ఆ మధ్యకాలంలో ఆయన తీసిన ఒకే ఒక్క వైవిధ్యభరిత, మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం మహేష్‌తో తీసిన 'నిజం' అనే చెప్పాలి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలను, మహేష్‌కి అవార్డులను, నటునిగా మంచిపేరును తెచ్చిపెట్టింది. నాటి నుంచి ఆయనకు దాదాపు పుష్కరం పాటు హిట్ కాదు కదా.. కనీసం యావరేజ్ కూడా రాలేదు. ఎట్టకేలకు రానా దగ్గుబాటితో 'నేనేరాజు నేనేమంత్రి' చిత్రంతో హిట్ అందుకున్నాడు.
ఇక తేజ తన కెరీర్‌లో ఇప్పటి వరకు మహేష్ తప్ప మరో స్టార్‌ని హ్యాండిల్ చేయలేదు. మహేష్ చిత్రాన్ని కూడా కమర్షియల్‌గా హిట్‌గా మలచలేకపోయాడు. తాజాగా రానా కూడా కేవలం అప్‌కమింగ్ యంగ్‌హీరోనే. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన రొట్టె విరిగి నెయ్యిలో పడింది. ఆయనకు బాలయ్యాస్ ఎన్టీఆర్ బయోపిక్‌తో పాటు వెంకటేష్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించే చాన్స్ వచ్చింది. 'నేనే రాజు నేనే మంత్రి'కి ముందే తేజ.. వెంకటేష్‌తో 'సావిత్రి' అనే చిత్రం చేయాలని భావించాడు. కానీ నాడు ఆయన ఇస్తున్న వరుస ఫ్లాప్‌లని చూసి వెంకటేష్ తెగింపు చేయలేకపోయాడు.
ఇక తాజాగా వెంకీ చిత్రం పక్కనపెడితే స్టార్ హీరోలను సరిగా హ్యాండిల్ చేస్తాడో లేదో తెలియని తేజ చేతిలో తెలుగు సినీ చరిత్రలో, మరీ ముఖ్యంగా బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నఎన్టీఆర్ బయోపిక్‌ని పెట్టడం పట్ల బాలయ్య కాస్త జాగ్రత్త పాటిస్తున్నాడట. ముందుగా వెంకీతో చిత్రం చేసి నిరూపించుకుని విజయం సాధిస్తేనే ఎన్టీఆర్ బయోపిక్ ఇస్తానని చెప్పాడట. దీంతో బాలయ్యను మెప్పించేందుకు వెంకీ చిత్రాన్ని కూడా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోతేజ చేయనున్నాడట...!