ఒకరు చేయాల్సిన పాత్రలు ఇతరులు చేతుల్లోకి వెళ్లడం సినిమా ఇండస్ట్రీలో మామూలే. పవన్ 'ఇడియట్', రవితేజ 'పోకిరి', పవన్ 'అతడు',రామ్ 'ఊసరవెల్లి' సుమంత్ 'తొలి ప్రేమ'..ఇలా వచ్చి పక్క వారికి వెళ్లిపోయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో హిట్స్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. తాజాగా 'రాజా ది గ్రేట్' కూడా రామ్, ఎన్టీఆర్‌లను చుట్టివచ్చింది. ఇక విషయానికి వస్తే తెలుగులో ఓ క్లాసిక్ చిత్రంగా 'మనం' చిత్రాన్ని చెప్పుకోవాలి. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఏయన్నార్‌కి చివరి చిత్రం కావడంతో, అక్కినేని ఫ్యామిలీ కలకాలం గుర్తుంచుకునే చిత్రంగా దీనిని చెప్పుకోవచ్చు. ఒకరి పేర్లలో ఒకరుగా ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రియ, అఖిల్‌లు కూడా నటించిన ఈ చిత్రం ఓ మెమెరబుల్ చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం విజయానికి ఖచ్చితంగా ఈ స్టోరీ అక్కినేని హీరోలు నటించడమే అని చెప్పుకోవచ్చు.
అదే వేరే వారితో చేసి ఉంటే ఆ ఫీల్ వచ్చి ఉండేది కాదు. ఇక ఈ చిత్రంలో నటించిన సమంతనే అక్కినేని ఫ్యామిలీకి కోడలు కావడం విశేషంగా చెప్పుకోవాలి. కానీ మొదట ఈ చిత్రాన్ని విక్రమ్ కె.కుమార్ వేరే వారితో చేద్దామని భావించారట. అక్కినేని పాత్రలో కె.విశ్వనాథ్, నాగార్జున స్థానంలో వెంకటేష్, నాగచైతన్య పాత్రలో సిద్దార్ధ్‌ని అనుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా సిద్దార్ధ్ తెలిపాడు.
ఈ చిత్రం కథ తనకి చెప్పడమే కాదు.... తనతో విక్రమ్ కె.కుమార్ పంచుకున్నాడని చెప్పి, ఇలాంటివి సినిమా ఫీల్డ్‌లో మామూలేనని చెప్పాడు. కానీ ఒక్కవిషయం. ఈ చిత్ర కథ అక్కినేని ఫ్యామిలీ వద్దకు రావడం ఎంత అదృష్టమో.. ఈ చిత్రాన్నిఅక్కినేని ఫ్యామిలీతో చేయడం విక్రమ్.కె.కుమార్‌కి కూడా అంతే అదృష్టమేననిచెప్పాలి. ఈ కథను విక్రమ్ కెకుమార్ ద్వారా నాగార్జునకి పంపిన ఘనత మాత్రం నితిన్, అతని తండ్రి సుధాకర్‌రెడ్డిలకు కూడా దక్కుతుంది.