అసలు 'రారండోయ్ వేడుక చూద్దాం' వేడుకలో పెద్దాయన ఆడాళ్లు పక్కలోకి పనికొస్తారని నోరు జారాడు. కానీ దానికి 'సూపర్‌సార్' అన్న కుర్ర యాంకర్ రవిది అంతకంటే పెద్ద తప్పు. ఇక చలపతిరావు అలా అన్నాడు..ఇలా అన్నాడు అని మనం మాట్లాడుకుంటున్నాంగానీ బుల్లితెరపై ఈ ఓవర్‌యాక్షన్ చూపించి, తమ సమయస్ఫూర్తిని చూపించాలనే అత్యుత్సాహంతో ఇంత కంటే పరమ చెత్త బూతు కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అది 'జబర్దస్త్' కానివ్వండి.. లేదా 'పటాస్' కానివ్వండి, వెండితెర కమెడియన్ల కంటే వల్గర్ భాషని, చేష్టలను రవి, శ్రీముఖి, రేష్మి, అనసూయ వంటి వారు చేస్తున్నారు. తాము ఏదో విరగబడినవ్వే కామెడీ చేస్తున్నామనే భ్రమలో బుల్లితెర వీక్షకుల చేత తిట్టించుకుంటున్నారు.
ఇక విషయానికి వస్తే నాడు చలపతిరావు వ్యాఖ్యలు ఆడియోసౌండ్ వల్ల తనకు సరిగా వినిపించలేదని, దాంతో క్యాజువల్‌గా సూపర్‌సార్ అనేశానని రవి కవరింగ్ ఇచ్చాడు. నాడు పెద్దాయనతోపాటు రవిపై కూడా మహిళా సంఘాలు పోలీస్‌స్టేషన్లలో కేసులు పెట్టాయి. ఈ వివాదం పెద్దది కావడం, ఇది పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లడంతో తాను తన తల్లిదండ్రులు, సోదరితో బయటికి వెళ్లినప్పుడు కూడా ఇదే విషయాన్ని తనను అడిగేవారని, తాను వినిపించక అలా అన్నాననే మాటను మా నాన్న కూడా నమ్మలేదని రవి చెప్పుకొచ్చాడు.
దాంతో ఈ ఫీల్డ్ నుంచి వెళ్లిపోవాలని భావించానని, కానీ శ్రీముఖి, సుమ, ప్రదీప్‌లు అండగా నిలబడ్డారని, తమకు కూడా అలాంటి సందర్భాలు ఎదురయ్యాయని చెప్పి వారించారని, శ్రీముఖి ఇచ్చిన ధైర్యం, సుమ ఇచ్చిన స్ట్రెంగ్త్ తాను ఇంకా ఇక్కడ ఉండటానికి కారణమని ఆయన చెప్పుకొచ్చాడు. వినేవాడుంటే హరిదాసు కూడా ఇంగ్లీషులో హరికథ చెబుతాడన్నట్లు ఇక్కడ తప్పంతా సుమ, శ్రీముఖి, ప్రదీప్‌లదేనని చెప్పాలి. సరే జరిగిందేదో జరిగింది కాబట్టి కనీసం సుమ అయినా పెద్దరికంగాఎలా మాట్లాడి మెప్పించాలో రవికి నేర్పిస్తే బాగుంటుంది....!