రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఒక భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. మహాభారతం వంటి ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఒక భాగాన్ని తీసుకుని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గా తెరకెక్కించబోతున్నట్లుగా అనౌన్స్ చేసి రచ్చ మొదలు పెట్టాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి నిర్మాతగా వైసిపి నేత రాకేష్ రెడ్డిని తీసుకోవడం, రోజాకి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో ఒక కీలకపాత్ర ఆఫర్ చెయ్యడం.. ఒకటేమిటి తెలుగుదేశం నేతలతో రోజూ యుద్ధం చేస్తూనే వున్నాడు. అసలు వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో ఎలాంటి నటులను ఎంపిక చేస్తాడో అనే ఆసక్తితో తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తుంటే... వర్మ మాత్రం ఎన్టీఆర్ పాత్రకి కొత్త నటుడిని... లక్ష్మి పార్వతి పాత్రకి కొత్త నటిని ఎంపిక చేస్తున్నట్లుగా చెప్పాడు.
అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో కీలక పాత్ర అంటే వర్మ తీసే సినిమాలో విలన్ పాత్రకి (చంద్రబాబు) వర్మ ప్రియ శిష్యుడు జెడి చక్రవర్తిని తీసుకుంటున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ముంబై వర్గాలు. రామ్ గోపాల్ వర్మ తన శిష్యుడు జెడి చక్రవర్తిని విలన్ పాత్రకి కావాలని అడిగినట్లు.. ఇద్దరి మధ్యలో ముంబై సాక్షిగా చర్చలు జరిగినట్టు వినికిడి. ఇప్పటీకే వర్మ జేడీని విలన్ పాత్రకి ఎంపిక చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. చంద్రబాబులా జెడి చక్రవర్తి కూడా గెడ్డం పెంచుకుని ఉంటాడు కాబట్టి.. ఆ బాబు పాత్రకి జెడి కరెక్ట్ గా సెట్ అవుతాడని నెటిజెన్లు కూడా అంటున్నారు.
మరి ఎన్టీఆర్, లక్ష్మి పార్వతిల పాత్రలకు కొత్తవాళ్ళని తెస్తున్న వర్మ విలన్ పాత్రకి జేడీని తీసుకుంటాడో? లేకుంటే మరొక కొత్త నటుణ్ని వెతుకుతాడో తెలియాల్సి ఉంది. ఇకపోతే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి జెడి చక్రవర్తి నిర్మాత అనే ప్రచారం జరగడం దాన్ని వర్మ ఖండించడం తెలిసిందే.