మన పరిశ్రమ వారు ట్రెండ్‌ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కొన్ని రోజులు యాక్షన్ చిత్రాలు, మరికొన్ని రోజులు ఫ్యామిలీ అండ్ ఎమోషన్ చిత్రాలు, మరికొన్ని రోజులు హర్రర్ థ్రిల్లర్, మరికొన్ని రోజులు హర్రర్ కామెడీ ఇలా..అన్నమాట. కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తే మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఎవర్‌గ్రీన్. కామెడీని నమ్ముకున్న ఎవ్వరూ, కామెడీని పండించడం అనే సూక్ష్మ విషయాన్ని గ్రహించిన వారెవ్వరూ ఫీల్డ్‌లో కనుమరుగు కాలేదు.
కానీ శ్రీనువైట్లలో ఒకే తరహా బకరా కామెడీని నమ్ముకోకుండా, సినిమా సినిమాకు వైవిధ్యం చూపుతూ, కాసింత గ్లామర్, యాక్షన్, ఎమోషన్స్ కలిపి సాధారణ కథను కూడా ఎంటర్‌టైనింగ్‌గా చెబితే వాటికి తిరుగే ఉండదు. ఇక తాజాగా విడుదలైన 'రాజా ది గ్రేట్' చిత్రం కూడా అదే కోవకి వస్తుంది. హీరో అంధుడు అన్న పాయింట్ తప్ప ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ఓ హీరోయిన్‌ని కాపాడేందుకు హీరో ఆ ఊరు వెళ్లి కాపాడటం అనేది 'ఒక్కడు' ముందు, తర్వాత చాలా సినిమాలలో చూశాం. ఇక ఈ చిత్రంలో హీరోకి విలన్‌కి ఓ ఫైట్, ఆ తర్వాత ఓ సాంగ్, వెంటనే ఓ సీన్.. ఇలా సాగింది. ఇంత రొటీన్ కథను కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించడం అనిల్‌కే సాధ్యమైంది.
నాడు జంధ్యాల, ఈవీవీ, రేలంగి నరసింహారావులు ఇలాంటి పంథాలోనే హిట్స్ కొట్టారు. ఇక జంధ్యాల కామెడీని పక్కనపెట్టి బ్రహ్మానందంతో తీసిన 'బాబాయ్ హోటల్' ఆడకపోవడానికి ఇదే కారణం. ఇప్పటికే 'పటాస్, సుప్రీమ్' వంటి చిత్రాలను హిట్ కొట్టిన అనిల్‌రావిపూడి మరోసారి తనదైన స్టైల్‌లో కామెడీని పండించి విజయకేతనం ఎగురవేశాడు. సాధారణంగా ఇలాంటి దర్శకులు తీసే చిత్రాలు పెద్దగా గొప్ప రివ్యూలను, రేటింగ్‌లను అందుకోకపోయినా, మేధావుల ప్రశంసలు పొందకపోయినా బాక్సాఫీస్ వద్ద వాటికతీతంగా ఫలితాన్ని అందిస్తాయని అనిల్‌రావిపూడి మరోసారి ప్రూవ్ చేశాడు. ఇదే బాటలో మరో రెండు మూడు హిట్లు కొడితే ఈ డైరెక్టర్‌కి తిరుగే ఉండదని చెప్పాలి.