ఒకప్పటి రాజకీయ చైతన్యం వేరు. నేటి ప్రజల్లో రాజకీయాల పట్ల అవగాహన, చైతన్యం బాగా ఉన్నాయి. ప్రజలు ఇన్‌స్టెంట్ ఫలితాల కోసం చూస్తున్నారు. అంతేగానీ 50ఏళ్ల తర్వాత అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది అని చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎన్నికల్లో గెలిపించిన తర్వాత ఐదేళ్లలో నువ్వు ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చావని ఓటర్లు ప్రశిస్తున్నారు. దీనికి ఓ ఉదాహరణ చెప్పాలంటే.. 20ఏళ్ల తర్వాత హైటెక్ సిటీగా హైదరాబాద్ వెలుగొందడానికి చంద్రబాబే అయినా తెలంగాణలో కాదు కదా...! చివరకు హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఫలితాలలో కూడా టిడిపికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. పివినరసింహారావు, రాజీవ్‌గాంధీల పుణ్యానే కంప్యూటరీకరణ, సాంకేతిక విప్లవం వచ్చి నేడు మనం ఫలాలు అందుకుంటున్నా కాంగ్రెస్‌ని కేంద్రంలో గద్దెనెక్కించడానికి ప్రజలు సిద్దంగా లేరు.
ఇక విషయానికి వస్తే చంద్రబాబు తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో పర్యటనలో ప్రవాసాంధ్రులు, ఐటినిపుణులతో భేటీ అయ్యారు. అలాగే జీ-టెన్ సభ్యులతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, చికాగోలో ఉంటే విజయవాడ లేదా హైదరాబాద్‌లో ఉన్నట్లు ఉందని, జాబులో సరిపెట్టుకోవద్దని జాబులు ఇచ్చేలా ఎదిగి సంపదను సృష్టించాలని కోరారు. వచ్చే 12 నెలల్లో 500 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించేలా చేయడమే తన లక్ష్యమని తెలిపాడు. విజయవాడలో ఐటీసంస్థలు స్థాపించేందుకు 60 సంస్థల ప్రతినిధులు ముందుకొచ్చారని అన్నాడు. 20ఏళ్ల కిందట తాను తీసుకున్న నిర్ణయాలే నాలెడ్జ్ ఎకానమిలో ఫలితాలు కనిపించడానికి కారణమని తనను తాను పొగుడుకున్నాడు.
ఐటీలో మనవారి హవా నడుస్తోందని, అక్వా రంగంపై దృష్టిపెట్టామని, రాబోయే కాలంలో మన చేపలు, రొయ్యలే అమెరికా ప్రతి చోటా కనిపిస్తాయన ఆశాభావం వ్యక్తం చేశాడు. జన్మభూమి రుణం తీర్చుకోవాలని, మన రాష్ట్రం వచ్చి సంస్థలను స్థాపించాలని, అలాగే మీరుంటున్న అమెరికాను కూడా మర్చిపోవద్దని హితవు చెప్పారు. ఏది ఏమైనా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన, ఆయన మంత్రులు చేసినన్ని విదేశీపర్యటనలు ఎవ్వరూ చేయలేదు. చంద్రబాబు ఏమి చేసినా ఎన్నికలలోపు ఫలితాలు కనిపించాలి. పోలవరం నుంచి బాబు వస్తే జాబు వరకు బాబు అలాంటి ఫలితాలను చేతల్లో చూపితేనే ప్రజలు నమ్ముతారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని భావించడం మబ్బులను చూసి ఉన్న ముంత ఒలకబోసుకోవడమే అవుతుంది....!