నిజానికి పవన్‌కళ్యాణ్ 'జనసేన' పెట్టిన తర్వాత ప్రజా సమస్యలపై ట్వీట్స్ చేస్తున్నాడు. ప్రజాసమస్యలను ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్క బిజెపిని తప్పించి ఆయన ఎవ్వరినీ వ్యక్తిగతంగా విమర్శించడం గానీ పొగడటం కానీ చేయడం లేదు. నంద్యాల, కాకినాడ ఎన్నికల సమయంలో కూడా తటస్థంగా ఉన్నాడే గానీ ఆయన వైసీపీనో మరో నాయకుడినో విమర్శించడంలేదు. వాస్తవానికి కిందటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన మొదట కేంద్రంలో బిజెపికి ఓటు వేయమని, రాష్ట్రంలో మీకు నచ్చిన వారికి ఓటేయమని చెప్పాడు. అయితే సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ బిజెపితో పొత్తు ఉన్న టిడిపికి సపోర్ట్ చేశాడు.
లోక్‌సత్తా జయప్రకాష్‌నారాయణ్‌కి అనుకూలంగా ప్రచారం చేయాలని భావించి, చివరకు ఒకవైపు టిడిపి సపోర్ట్ ఇస్తూ మరో వైపు జెపికి ప్రచారం చేయడం ద్వంద్వనీతి అని మౌనంగా ఉన్నాడు. ఇవేవో పవన్‌ని పొగిడేందుకు చెప్పే మాటలు కాదు. ఆయన తన దారి వేరు... తన ఆశయాలు వేరు అన్నట్లుగా ట్విట్టర్ పులి అని ఎన్ని విమర్శలు చేసినా మౌనంగా ఉంటున్నాడు. ఇక ఆయన అక్టోబర్ నుంచి ప్రజాచైతన్య స్రవంతిలోకి వస్తానని, పాదయాత్రలైనా, బస్సు యాత్రలైనా, సభలు, సమావేశాలైనా ప్రజల బాధలను పంచుకోవడానికే అని క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా జగన్ 120 నియోజకవర్గాల్లో 3,600కిలోమీటర్ల మహాపాదయాత్రకు నవంబర్2 నుంచి రెడీ అవుతున్నాడు. ఇక మిగిలిన 55 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేయనున్నాడు.
ఇదే సమయంలో పవన్ కూడా ప్రజాయాత్రలు చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. దీనిపై వైసీపీనేత నటి రోజా స్పందిస్తూ.. 'పవన్ యాత్రపై మాకు సమాచారం లేదు. ఆయన రాజకీయాలలోకి రావాలనుకున్నప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండాలి. వారి సమస్యల మీద పోరాడి ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రస్తుతం ఆయన ఉన్న వైఖరిలోనే ఉంటే ప్రజలు నమ్మరు' అని ఉచిత సలహాలు ఇచ్చింది. మొత్తానికి రోజా టాలెంట్ ఏమిటంటే.. మౌనంగా ఉన్న వారిని కావాలని తన హావభావాలు, మాటలతో రెచ్చగొడుతుంది. దాంతో ప్రత్యర్దులు ఉదాహరణకు పవన్ గానీ, అయన అభిమానులుగానీ రెచ్చిపోతే దానినే రాజకీయం చేసి మైలేజ్ పొందాలని భావిస్తుంది. ఇక మరోపక్క జగన్ పాదయాత్ర సమయంలోనే పవన్‌కి కూడా యాత్ర చేసే జగన్‌కి అనుకున్నంత మైలేజ్ రాకపోవచ్చు. దీంతో పవన్ యాత్రను టిడిపి ప్రోత్సాహంతో, చంద్రబాబు సహకారంతో పవన్ చేస్తున్నాడనే విమర్శలను మరింత బలంగా వినిపించాలనేది వైసీపీ వ్యూహంలా కనిపిస్తోంది.