మేల్‌డామినేటెడ్ ఇండస్ట్రీకి మన దేశ సినీరంగాన్ని చెప్పాలి. ఎప్పుడో 'మేరికోమ్, క్వీన్' వంటి చిత్రాలు వస్తూ ఉంటాయి. సహజంగా మన సౌత్ బాలీవుడ్‌తో పోల్చుకుంటే మరింత పురుషాధిక్య ప్రపంచం. హీరోయిన్లు కేవలం ఆడే బొమ్మలు మాత్రమే. గ్లామర్ చూపించి, హీరోతో అర్ధనగ్నంగా చిందులేయడానికి, ఏదో మాస్ జనాల కోసం హీరోయిన్స్ ఉన్నారా? అంటే ఉన్నారు.. ఒకరు కూడా చాలడంలేదు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ అందాల ఆరబోత.. పైగా ఐటం సాంగ్, స్పెషల్ సాంగ్స్ పేరుతో కాజల్, తమన్నా, శృతిహాసన్, రాశిఖన్నా నుంచి సన్నిలియోన్ వరకు మరికొందరు గ్లామర్‌షో. ఇక ఏదైనా హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ పాత్రలను చేస్తోంది అంటే ఇక ఆమె కెరీర్ ఫేడవుట్ కిందకు వచ్చినట్లేనని సినీ జనాలే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా భావించే పరిస్థితి.
అలాంటి గ్లామర్ ప్రపంచంలో లేడీ ఓరియంటెడ్ పాత్రలతో నాటి శ్రీదేవి, జయప్రద, జయసుధ కూడా పెద్దగా మెప్పించలేకపోయారు. నాటి తరంలో ఊర్శశి శారద మాత్రమే 'ప్రతిధ్వని, ప్రేమఖైదీ' వంటి చిత్రాలతో పాటు పలు చిత్రాలలో లేడీ ఓరియంటెడ్ పాత్రలు,యాక్షన్‌సీన్స్ చేసి మెప్పించింది.ఇక ఆమె మలయాళంలో మూడు సార్లు ఊర్వశి అవార్డుతో పాటు నేషనల్ అవార్డుని కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ఆ క్రేజ్ విజయశాంతికి వచ్చింది. 'కర్తవ్యం' తర్వాత ఎంతటి టాప్‌స్టార్ చిత్రంలో అయినా సరే ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉండేలా, యాక్షన్ సీన్స్ ఉండేలా దర్శకులు జాగ్రత్తలు తీసుకునేవారు. ఆ తర్వాత ఆ స్థాయికి ఎదిగిన నటీమణులుగా తమిళంలో నయనతారని, తెలుగులో కాస్తోకూస్తో అనుష్కని చెప్పుకోవచ్చు. ఇక నయనతార విషయానికి వస్తే ఆమె ఇంత లాంగ్ కెరీర్‌ని సాధించి, ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్‌హీరోయిన్‌గా వెలుగొందడం ఓ విశేషం.
ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆమె హవా అంతా ఇంతా కాదు. టాప్‌స్టార్స్ నుంచి కొత్తగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే వారసులు, కొత్తవారు కూడా తమ చిత్రంలో నయననే కావాలని పట్టుబడుతున్నారు. ఆమె బొమ్మని పోస్టర్లలలో చూసి నిర్మాతల వద్దకు బయ్యర్లు పరుగులు పెడుతున్నారు. ప్రేక్షకులు హీరోలతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్‌ని తీసుకొస్తూ, ఆమె కోసమే థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఆమె పేరు మీదనే సినిమాల బిజినెస్‌లు పెరుగుతున్నాయి. సో.. విజయశాంతి తర్వాత లేడీ సూపర్‌స్టార్ అన్నా,లేడీ అమితాబ్ అన్నా అది నయనకే చెందుతుంది. ఇక ఆమె కూడా హీరోయిన్లు వేషాలు తగ్గించి, లేడీ ఓరియంటెడ్ పాత్రలు ఎక్కువగా చేస్తోంది. 'మాయా, తని ఒరువన్, నానుం రౌడీథాన్' వంటి అన్నిరకాల పాత్రలు పోషిస్తోంది.ప్రస్తుతం ఆమె 'అరవి' చిత్రంలో పొలిటిషియన్స్ ఆట కట్టించే పవర్‌ఫుల్ కలెక్టర్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తెలుగులో విజయశాంతి చిత్రమైన 'కర్తవ్యం' అనే టైటిల్‌ని పెట్టడంచూస్తేనే ఆమెకున్న ఫాలోయింగ్ అర్ధమవుతోంది...!