మెగామేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్‌తేజ్ 'పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్' చిత్రాలతో మాస్ ఇమేజ్ తెచ్చుకుని ఊపు మీద కనిపించాడు. తన మొదటి చిత్రం ఆలస్యంగా విడుదలైన 'రేయ్' డిజాస్టర్ అయినా ఆయన కెరీర్‌పై అది పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ అదే సమయంలో కాస్త తిక్క చూపి 'తిక్క, విన్నర్' వంటి డిజాస్టర్స్ అందుకున్నాడు. ఎంతో కష్టపడి చేసిన 'నక్షత్రం'లోని కీలకపాత్ర ఆయనకు మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక ప్రస్తుతం ఆయన రచయిత బివిఎస్ రవి దర్శకత్వంలో 'జవాన్' చేశాడు. అవుట్‌పుట్ సరిగా రాలేదని చెప్పడం, ఇతర పెద్ద చిత్రాల పోటీ వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడుతోంది.
మరోపక్క సి.కళ్యాణ్ నిర్మాతగా వి.వి.వినాయక్‌తో చేసే చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తన చిన్నమేనమామకు 'తొలిప్రేమ'తో ఎవర్‌గ్రీన్ హిట్టిచ్చిన కరుణాకరన్ దర్శకత్వంలోనే 'తొలిప్రేమ' సీక్వెల్ వంటి చిత్రాన్ని కె.యస్.రామారావు బ్యానర్ లో చేస్తున్నాడు. తాజాగా ఆయన 'విన్నర్' దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో చిత్రం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ చిత్రం కోసం కమర్షియల్ హంగులతో ఓ ప్రత్యేక కథను గోపీచంద్ తయారు చేశాడట. వాస్తవానికి గోపీచంద్ మలినేనికి 'బలుపు' తర్వాత సరైనహిట్టే లేదు. రామ్ హీరోగా చేసిన 'పండగచేస్కో, విన్నర్'లు అనుకున్నంత విజయం సాధించలేదు. అయినా మరోసారి ఇదే కాంబినేషన్‌లో చిత్రం చేసి హిట్‌కొట్టాలనే పట్టుదలతో వీరు ఉన్నారు. ఈ చిత్రాన్ని నిర్మాతలు భగవాన్, పుల్లారావులు నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన సాయిధరమ్‌తేజ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు.