వర్మ అంటే ఆషామాషీ కాదు. ఆయన నిత్యం వార్తల్లో ఉంటాడనే అపవాదు ఉన్నా కూడా ఆయనతో పెట్టుకుంటే ఎవరితోనైనా సై.. అంటే సై అంటాడు. ఇక అక్కుపక్షి అని వ్యాఖ్యానించిన నాగబాబుని ముప్పుతిప్పలు పెట్టి ఇప్పటికీ పవన్‌ని వదలడం లేదు. ఇక ఆయన తీస్తానని చెబుతోన్న వర్మ చిత్రం 'లక్ష్మీస్‌ఎన్టీఆర్' చిత్రంపై తెలిసి తెలియని టిడిపి నేతలు మండిపడుతూ అధికారం తమదేనని ఇష్టం వచ్చినట్లు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు, బాలయ్యలకు వర్మతో పెట్టుకునే ఆయన నోటికి పోలేమని మౌనంగా ఉన్నారు. లోకేష్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
కానీ సీనియర్ తెలుగుదేశం నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే అనితలు ఏదేదో మాట్లాడి వర్మ ఇచ్చిన కౌంటర్‌కి దిమ్మతిరిగి ఆ విషయంపై వర్మ వ్యాఖ్యలను మరలా ఖండించే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడిప్పుడు రాజకీయాలలోకి తెలుగుదేశంలోకి ఎంటరై వైసీపీ రోజాలాగా ఫైర్‌బ్రాండ్ అనిపించుకోవాలని చూస్తున్న వాణివిశ్వనాథ్ తెలిసి తెలిసి వర్మని హెచ్చరించింది. ఎన్టీఆర్ వీరాభిమానిగా, ఆయన చివరి చిత్రం హీరోయిన్‌గా వర్మకి వార్నింగ్ ఇస్తున్నాను. ఆయన ఎన్టీఆర్‌ని వ్యంగ్యంగా, ఎలా పడితే అలా చూపిస్తే ఒప్పుకోను. ప్రజలు ఆయనను దేవుడిలా కొలుస్తున్నారు. రాముడు, కృష్ణుడు అంటే ఆయనేనని పూజిస్తున్నారు. ఆయనను చెడుగా చూపితే ఎన్టీఆర్ అభిమానులతో కలిసి ఆయన ఇంటి ముందు ధర్నా చేసే తొలిమహిళను నేనే అని వార్నింగ్ ఇచ్చింది.
దానిని యధాతధంగా ప్రస్తావించిన వర్మ 'వాణిగారూ... నాకు అసలు ఇల్లే లేదు. మరి నా ఇంటి ముందు మీరు ధర్నా ఎలా చేస్తారు? నేను రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను. ఆ రోడ్లపై నన్ను వెతికితే మీ పాదపద్మాలు కమిలిపోవూ'.. అని సెటైర్ విసిరాడు. వాస్తవానికి వర్మ ఎప్పుడో..ఎన్టీఆర్ ఏ ఒక్కరి సొంతం కాదు. ఆయన అందరికీ చెందిన వ్యక్తి, ఆయనపై చిత్రం ఎవరైనా తీయవచ్చు.ఎవరి కోణంలో వారు తీస్తారు. నా కోణంలో నేను తీస్తానని చెప్పాడు. ఇక గాంధీ, రాముడు, కృష్ణుడు, జీసస్‌ని కూడా చెడుగా చూపించిన చిత్రాలు వచ్చాయి. రావణుడు, ధుర్యోధనుడు, కర్ణుడి వంటి ప్రతినాయకులను హీరోలుగా చూపించిన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకడు కదా...!