ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ - సీరత్ కపూర్ లు జంటగా, నాగార్జున, సమంతలు కీ రోల్స్ పోషిస్తున్న 'రాజు గారి గది 2' ఈరోజే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రాజుగారి గదికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలోనూ ఫుల్ కామెడీ ఉంటుందని... నాగ్ మెంటలిస్టుగా కనబడతాడని.. సమంత మొదటిసారి ఆత్మగా కనబడనుందనే విషయాలు తెలిసినవే. అయితే సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు రాజుగారి గది 2 ప్రీ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఆ ప్రీ రివ్యూ ఎలా వుండబోతుందో అనేది చూద్దామా.
మరి సోషల్ మీడియా టాక్ ప్రకారం రాజుగారి కథ విషయానికి వస్తే కొంతమంది ఫ్రెండ్స్ బ్యాచ్ హాలీడేస్ ని ఎంజాయ్ చెయ్యడానికని గోవాకి వెళతారు. గోవాలో బీచ్ కి సమీపంలోని ఒక రిసార్ట్స్ లో దిగుతారు. అక్కడ వారి గదిలో కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల ఆధారంగా ఆ ప్లాట్ లో దెయ్యం ఉందని భయపడతారు. ఆ దెయ్యాన్ని మెంటలిస్ట్ అయిన నాగ్ కనిపెడతాడని చర్చ్ ఫాదర్ నరేష్ ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ కి చెబుతాడు. ఇక ఆ దెయ్యాన్ని కనిపెట్టడానికి మెంటలిస్ట్ గా నాగ్ రంగంలోకి దిగుతాడు. అయితే ఆ దెయ్యం ఒక అమ్మాయి ఆత్మ అని వారికి చెబుతాడు నాగ్. ఆ అమ్మాయి ఎందుకు ఆత్మగా మారింది? ఆ ఆత్మని నాగ్ ఏం చేశాడు? అసలు ఆ గదికి, ఆత్మకి ఉన్న సంబంధం ఏమిటనే అంశాలతో సినిమా కథ అల్లుకుని ఉంటుందంటూ చెబుతున్నారు.
ఇకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ ఆంతా కామెడీతో నిండి ఉంటుందని... తర్వాత నాగ్ ఎంట్రీతో కథలో సీరియస్ నెస్ మొదలవుతుందని... ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో సినిమాకి ఇంటర్వెల్ పడుతుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ అంతా నాగ్ మెంటలిస్ట్ గా ఆత్మని కంట్రోల్ చెయ్యడం... అసలు ఆ అమ్మాయి ఆత్మగా మారిన పరిస్థితులను తెలియజెప్పడంతో సినిమా ముగుస్తుంది. నాగ్ మెంటలిస్ట్ గా ఇరగదీశాడని.. సమంత ఆత్మగా అదరగొట్టింది అంటున్నారు. ఇక అశ్విన్, వెన్నెల కిషోర్, షకలక శంకర్ లు కడుపుబ్బా నవ్వించారని చెబుతున్నారు. పూర్తి వివరాలు కాసేపట్లో మన రివ్యూ లో తెలుసుకుందాం.