ప్రస్తుతం రాష్ట్రంలో వర్మ తీస్తానని చెప్పిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం కలకలం రేపుతోంది. వర్మ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మిపార్వతి ఎంటర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలను తీస్తానని చెప్పాడు. ఇక తాను ఎవరిని కించపరిచే ఉద్దేశ్యంతో ఈ చిత్రం చేయడం లేదని, పొలిటికల్ యాంగిల్‌లో తాను ఎవ్వరినీ టార్గెట్ చేయడం లేదని వర్మ ఆల్‌రెడీ క్లారిటీ ఇచ్చారు. కానీ దీనిపై కింది స్థాయి నుంచి అధిష్టానం వరకు తెలుగుదేశం కీలకనాయకులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఇక తాజాగా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో తీయనున్న చిత్రంపై ఎన్టీఆర్ మనవడు, ఏపీ రాష్ట్రమంత్రి నారా లోకేష్ స్పందించాడు.
ఉపాధిహామీ పథకం అమలుపై పలు శాఖా మంత్రులు, అధికారులతో ఆయన భేటీ అయిన తర్వాత మీడియా ఆయనను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో మీ స్పందనేంటి అని అడగ్గా.. ఆ చిత్రాన్ని తీస్తే తీయనివ్వండి.. అది సినిమా మాత్రమే.. సినిమా గురించి మాట్లాదేముంటుంది? ప్రజా సమస్యలపైనే నేను స్పందిస్తాను అంటూ కాస్త హుందాగానే సమాధానం చెప్పాడు. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకుడు, ప్రస్తుత వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్మ చిత్రంపై స్పందిస్తూ 'వర్మ కొత్తగా చూపించేది ఏముంటుంది? ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మిపార్వతి ఎంటర్ అయిన తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీని తన గుప్పిట్లోకి తీసుకోవాలని, పార్టీని నాశనం చేయాలని భావించిన సంగతి ప్రజలందరికీ తెలుసు. మరి ఈ విషయాలు వర్మకి, ప్రజలకి తెలియవా? కేవలం పొలిటికల్ టార్గెట్‌తోనే చిత్రాన్ని తీస్తే మాత్రం ప్రజలు తిప్పికొడతారు' అని వ్యాఖ్యానించాడు.
మరో ముఖ్య విశేషం ఏమిటంటే.. తిరుపతిలో ఎన్టీఆర్ 'మేజర్ చంద్రకాంత్' వేడుకలో లక్ష్మిపార్వతిని వివాహం చేసుకుంటున్నానని బహిరంగంగా ప్రకటించిన తర్వాత తిరుపతి నుంచి ఎన్టీఆర్,లక్ష్మీపార్వతి దంపతులను ముందుగా తన స్వంత ఊరైనా నెల్లూరులోని అల్లీపురంకి తీసుకుని వచ్చి, దంపతుల ఆశీర్వాదం తీసుకుని,లక్ష్మీపార్వతి దేవత. ఆమె వల్లనే నాకు సీటు వచ్చింది.. అని చెప్పి తన సొంత ఇంట్లో వారిని నిద్ర చేయించిన వ్యక్తి ఈ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఈయనతో పాటు బాబూ రాజేంద్ర ప్రసాద్‌తో పాటు పలువురు తెలుగుదేశం కీలక నేతలు ఈ చిత్రంపై మాట్లాడుతున్న తీరు చూస్తుంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుము కున్నట్లే ఉంది....!