తెలుగులో యంగ్‌విలన్ పాత్రలలో మెప్పిస్తున్న వారిలో తెలుగువారు ఇద్దరు ముఖ్యంగా చెప్పుకోవాలి. వారే సుబ్బరాజు, అజయ్. ఇక అజయ్ హీరోగా కూడా చేసినా మెప్పించలేకపోయాడు. కానీ సుబ్బరాజు మాత్రం విలన్‌గా ఎప్పుడు బిజీగానే ఉంటూ వచ్చాడు. కానీ ఈమధ్య ఆయన ఎక్కువ సినిమాలలో కనిపించడం లేదు. ఇక ఆయన యంగ్‌విలన్‌గా విలనిజాన్నే కాదు... కామెడీని మిక్స్ చేస్తూ విలనిజంలో కూడా హాస్యాన్ని చూపించగలనని పలు చిత్రాలతో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఇలాంటి హాస్యంతో కూడిన విలనిజం చూపించడంలో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం మాస్టర్‌పీస్ అయిన 'బాహుబలి' చిత్రమే.
ఈ చిత్రంతో ఆయన తెలుగునాట మాత్రం అందరికీ బాగా గుర్తుండిపోయాడు. మరి పలు భాషల్లో విడుదలైన ఈచిత్రం ఆయనకు ఇతర భాషలలో కూడా బాగానే గుర్తింపు తెచ్చింది. కానీ ఇంతటి గుర్తింపు వచ్చినందుకు ఆనందపడాలా? పలు అవకాశాలను ఈ చిత్రం వల్ల కోల్పోవడం వల్ల బాధపడాలో తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడని మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. 'బాహుబలి' కోసం ఎక్కువ డేట్స్ ఇవ్వడం, ఆ చిత్రం షూటింగ్ సాగినంత కాలం అదే గెటప్‌ని మెయిన్‌టెయిన్ చేయాల్సి రావడంతో తనకు ఆ సమయంలో వచ్చిన చిత్రాలు మిస్ అయ్యాయని అంటున్నాడు. ఆ సమయంలో తనకు వచ్చిన పలు చిత్రాల ఆఫర్స్ ఇతరులకు వెళ్లాయని, ఆయా చిత్రాలే ఇటీవల విడుదలవుతున్నాయని చెప్పుకొచ్చాడు.
అలాగని తనకు అవకాశాలు రాకపోవడం అంటూ ఏమీ లేదని తెలిపాడు. 'బాహుబలి'కి దాదాపు ఐదేళ్లు పడిన కష్టం రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి వారికి బాగానే వర్కౌట్ అవుతూ, వారి మార్కెట్ విలువని పెంచి ఇతర భాషల్లో కూడా పెద్ద క్రేజ్‌ని తెచ్చి, అలాంటి అవకాశాలను వారికి వచ్చేలా చేస్తోంది. మరి ఇతర భాషల్లో కూడా సుబ్బరాజు తనకు వచ్చిన క్రేజ్‌ని ఎంత వరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. ఎందుకంటే అవ్వా కావాలి.. బువ్వా కావాలి అంటే వీలుకాదనే సామెత మన పెద్ద వారు ఊరికే చెప్పలేదు కదా...!