సూపర్‌స్టార్ కృష్ఱ కెరీర్‌లో 'అల్లూరి సీతారామరాజు' ఎప్పటికి గుర్తిండిపోయే అజరామరమైన చిత్రం. ఈ చిత్రం నాడే కాదు నేటికి అందరినీ అలరిస్తూ కృష్ణ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తోంది. కాగా ఈ చిత్రం నాడు స్వర్గీయ ఎన్టీఆర్ చేస్తానన్నా కూడా ఆయనను ఎదిరించి కృష్ణ చేసి మరీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఆలోటును పూడ్చుకోవడానికి ఎన్టీఆర్ తన 'మేజర్ చంద్రకాంత్'లోని పాటలో సీతారామరాజుగా కనిపించి మురిపించాడు. ఇక కృష్ణ నాటి నుంచి ఛత్రపతి శివాజీ బయోపిక్‌ని తీయాలని ఎంతో తపన పడ్డాడు. ఆయన ఆ పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాడు కూడా. 'సింహాసనం', 'తెలుగువీర లేవరా' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలన్నింటి కంటే ముందు కృష్ణ ఛత్రపతి శివాజీ బయోపిక్‌నే తీయాలని భావించాడు. కానీ ఏ విషయంలోనూ భయపడని, ఎవర్‌గ్రీన్, డేరింగ్ అండ్ డాషింగ్ అయిన కృష్ణ ఆ చిత్రం విషయంలో భయపడ్డాడు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రలో ఎక్కువ భాగం దేశాన్ని ఆక్రమిస్తున్న ముస్లింలను మట్టుపెట్డడం మీదనే సాగుతుంది. తనకున్న అభిమానుల్లో ముస్లింలే ఎక్కువని, వారిని చెడుగా చూపించలేక కృష్ణ ఆ పాత్ర చేయలేకపోయాడని కొందరికి మాత్రమే తెలుసు.
ఇక తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన ట్విట్టర్‌లో 'పరుచూరి పలుకులు' అనే వీడియోలో మాట్లాడుతూ, కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు'లాగా ఆయన ఛత్రపతి సినిమా చేయాలని ఆశపడ్డా చేయలేకపోయారు. ఇక మహేష్ బాబు అయినా ఛత్రపతి శివాజీగా నటిస్తే చూడాలని ఉంది. ఆయన ఈ పాత్రకు కరెక్ట్‌గా సూట్ అవుతారు. ఈ చిత్రం చేస్తే మహేష్‌బాబుకి దేశ, విదేశాలలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ పాత్రను మహేష్ చేయాలని నేను కోరుతున్నా..మీరు ఆయన్ను అదే అడగండీ.. అని అభిమానులకు రిక్వెస్ట్ చేశాడు.
నిజంగా 'బాహుబలి' రేంజ్‌లో మహేష్ ఛత్రపతి శివాజీ బయోపిక్ తీస్తే సంచలనం ఖాయం. కానీ మహేష్ ఈ సినిమా చేస్తాడా? కృష్ణ చేయలేని సాహసాన్ని మహేష్ చేసే చూపిస్తాడా? చూడాలి. ఇక ఈచిత్రం తీయాలని ఇప్పటికే కొందరు బాలీవుడ్ దర్శకనిర్మాతలు, హీరోలు ఉబలాటపడుతున్నారు. అంతలోపే రాజమౌళితో మహేష్ చేసే చిత్రం 'ఛత్రపతి శివాజీ'నే అయితే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం.