నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికే తన 100వ ప్రతిష్టాత్మక చిత్రంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' తో వచ్చాడు. సెప్టెంబర్ 1న ఆయన నటించిన 101వ చిత్రం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'పైసావసూల్'తో పలకరించాడు. అయినా వెంటనే గ్యాప్ లేకుండా తన 102వ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ తమిళ దర్శకుడు కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మాతగా చేస్తున్నాడు. ఈచిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి12న విడుదల కానుందని, ఈ చిత్రానికి 'కర్ణ' అనే టైటిల్‌ని పెట్టినట్లు సమాచారం.
ఇక బాలయ్య తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్‌ను సినిమాగా రూపొందించే పనిలో ఉన్నాడు. స్క్రిప్ట్ దాదాపు ఫైనలైజ్ అయిందని, తేజ, పూరీజగన్నాథ్, కె.యస్.రవికుమార్ వంటి దర్శకులను ఈ చిత్రంకోసం పరిశీలిస్తున్నాడని తెలుస్తోంది. ఎక్కువ అవకాశాలు తేజకే ఉన్నాయంటున్నారు. కాగా నాటి స్వర్గీయ ఎన్టీఆర్ బతికుండగా రామకృష్ణా సినీ స్టూడియోస్ పతాకంపై చిత్రాలను నిర్మించేవారు. కానీ ఆయన మరణానంతరం అది కూడా దాదాపు కనుమరుగైపోయింది. ఇక ఎన్టీఆర్ వంశంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌కి 'ఎన్టీఆర్ ఆర్ట్స్' బేనర్ ఉంది. ఇక ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన వైవిఎస్ చౌదరి స్థాపించిన 'బొమ్మరిల్లుపతాకం' బేనర్‌ని కూడా మొదట్లో అందరూ నందమూరి అభిమానులు తమ సొంత బేనర్‌గా భావించేవారు. కానీ 'రేయ్'తో సీన్ మారింది. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన బావమరిది గీతాఆర్ట్స్ అల్లుఅరవింద్ బేనర్‌తో పాటు నాగబాబు బేనర్ అంజనా ప్రొడక్షన్స్ ఉండేది. కానీ 'ఆరెంజ్' చిత్రంతో అంజనా ప్రొడక్షన్స్ బేనర్‌లో ఇక సినిమాలు చేయనని చెప్పిన నాగబాబు బన్నీ 'నా పేరు సూర్య' చిత్రానికి లగడపాటి శ్రీధర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.
ఇక చిరంజీవి 150వ చిత్రం ద్వారా చిరంజీవి తన కుమారుడు రామ్‌చరణ్ నిర్మాతగా 'కొణిదెల ప్రొడక్షన్స్'ని స్థాపించి, తన 151వ 'సై..రా..నరసింహారెడ్డి'ని కూడా అదే బేనర్‌లో చేస్తున్నాడు. వెంకటేష్‌కి సురేష్‌ప్రొడక్షన్స్, నాగార్జునకి అన్నపూర్ణ సినీ స్టూడియోస్ బేనర్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనకు పెద్దగా హరికృష్ణ, జూనియర్, కళ్యాణ్‌రామ్‌లతో అనుబంధం లేకపోవడడంతో తానే స్వయంగా ఓ కొత్త బేనర్‌ని స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో నిర్మాణ భాగస్వామిని తనకి మంచి స్నేహితుడు, ఆప్తుడైన వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటిని తీసుకోనున్నాడని సమాచారం. ఈ బేనర్‌లోనే ఎన్టీఆర్ బయోపిక్‌తో పాటు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రం కూడా ఉండనుందని ఖాయంగా తెలుస్తోంది.