టాలీవుడ్ లో నెంబర్ 1 నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజు మొదటిసారి భారీ బడ్జెట్ తో ఒక భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాడు. తెలుగు, తమిళంలో భారీ ప్రాజెక్ట్ గా ఇండియన్2 సినిమాని కమల్ హాసన్ హీరోగా భారీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అసలు దిల్ రాజు.... కమల్ హాసన్ - శంకర్ కలయికలో ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటినుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. అసలు కమల్ - శంకర్ కలయికలో వచ్చిన భరతీయుడు సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మరి అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవడము.. కేవలం తెలుగు సినిమాలను మాత్రమే నిర్మించే దిల్ రాజు మొదటిసారి తెలుగు, తమిళం కలిపి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడంతో ఈ సినిమాకి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది.
ఇకపోతే దర్శకుడు శంకర్ తో సినిమా అంటే అది ఏ లెవల్లో ఉంటుందో అందరికి తెలిసిందే. దక్షిణాదిన అతి భారీ సినిమాలను తెరకెక్కించగల సమర్ధవంతమైన దర్శకుడు శంకర్. మరి ఆ దర్శకుడితో సినిమా చెయ్యాలి అంటే నిర్మాతలకు చాలా డేర్ ఉండాలి. ఇప్పటి వరకు శంకర్ చేసిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం దీనికి ఉదాహరణ. ఇప్పుడు ప్రస్తుతం శంకర్, రజినీకాంత్ హీరోగా ఇండియాలోనే 450 కోట్ల అతి భారీ బడ్జెట్ చిత్రంగా 2 .0 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరి అలాంటి దర్శకుడితో దిల్ రాజు కూడా పనిచేస్తున్నాడు అంటే... అన్నిటికి సిద్ధపడే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడనే అంటున్నారు.
అయితే శంకర్ - కమల్ కలయికలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాని దిల్ రాజు 200 కోట్ల పెట్టుబడితో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. సామాజిక అంశం నైపథ్యంలో ఉండబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అయిపోయిందని టాక్ వినబడుతుంది. తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇంకా ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తారని చెబుతున్నారు. మరి ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేసి మరీ సినిమాలను నిర్మించే దిల్ రాజు... ఒక సినిమా మీద ఎన్నడూ లేని విధంగా 200 కోట్ల పెట్టుబడి పెడుతున్నాడు అంటే ఆ సినిమా కథ ఆయనకు ఎంతగా నచ్చకపోతే ఇలాంటి సినిమాని అనౌన్స్ చేస్తాడు అంటున్నారు.