ప్రేక్షకుల నాడి ఎప్పుడు ఎలా ఉంటుంది? ఏచిత్రానికి పట్టం కడతారు? ఏ చిత్రానికి నో చెబుతారు అనేది బ్రహ్మదేవుడికి కూడా తెలియని బ్రహ్మపదార్దంగా మారింది. ఇక తెలుగునాట అమావాస్య సెంటిమెంట్ వల్ల తెలుగు చిత్రాలను పెద్దగా రిలీజ్ చేయరు. కానీ దీపావళి తమిళులకు, ఉత్తరాది వారికి ముఖ్యమైన పండుగ కావడంతో అక్కడ మాత్రం బాగానే చిత్రాలను రిలీజ్ చేస్తుంటారు. ఇక విషయానికి వస్తే దీపావళి అమావాస్య సెంటిమెంట్‌ను బ్రేక్ చేయడానికి ఈసారి మాస్ మహారాజా రవితేజతో కలిసి దిల్‌రాజు, దర్శకుడు అనిల్‌రావిపూడిలు కలసి 'రాజా ది గ్రేట్'గా వస్తున్నారు.
ఈ చిత్రం ట్రైలర్ చూస్తే ఒక గుడ్డివాడు.. ఆయన్ను ఎంతగానో నమ్మే తల్లి, ఒక హీరోయిన్. ఆమెను ప్రపంచంలోనే కాపాడగలిగిన ఓకేఒక్క హీరో, బకారా తల్లిదండ్రులు, పోలీసులు.. ఇదీ తంతు. గుడివాళ్లకి మిగతా అవయావాలైన చెవులు, ముక్కులే కాదు.. స్పర్శజ్ఞానం కూడా దేవుడు బాగా ఇస్తాడు. దాంతో ఈ చిత్రంలో హీరో గుడ్డివాడైనా అన్ని చేసేస్తుంటాడు. ఇలా కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ ట్రైలర్ సాగింది. ఇక ఈ చిత్రం గురించి దిల్‌రాజు చెబుతూ.... తెలుగులో అమావాస్య సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తామని, ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సిక్స్‌లు కొట్టానని, అవి 'శతమానం భవతి, నేనులోకల్, డిజె, ఫిదా' అవి కాక తాను కొట్టే ఐదో సిక్సే 'రాజా దిగ్రేట్' అని, ఆరోసిక్సర్‌ని డిసెంబర్‌లో నాని 'ఎంసిఏ' ద్వారా కొడతానని డంకా భజాయించి చెప్పాడు. ఇక రవితేజ మాట్లాడుతూ అనిల్‌రావిపూడి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని, మెహ్రీన్ విషయానికి వస్తే గ్లామర్‌తోనే కాదు.. అభినయం, అంకిత భావంతో కూడా ఆశ్యర్యకలిగించిందని ఆమె తెలుగు నాట జెండా పాతడం ఖాయమని తనదైన స్టైల్‌లో చెప్పాడు.
ఇక రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఇండస్ట్రీలో 40 ఏళ్ల నుంచి ఉన్నానని, ఇలాంటి చిత్రం ఇప్పటివరకు తెలుగులో రాలేదని, తెలుగులోనే కాదు ... ఏ భాషలోకూడా రాలేదని 'రాజా దిగ్రేట్'ని ఆకాశానికెత్తేశాడు. ఇక అనిల్‌రావిపూడి నిర్మాత దిల్‌రాజు, హీరో రవితేజ తనని 'గుడ్డి' గా నమ్మడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చిందన్నాడు. తనలాంటి దర్శకులకు నిర్మాత దిల్‌రాజు ఓ పెద్ద బాలశిక్ష వంటి వాడని తెలిపాడు. అయినా కూసింత కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటేనే కంటెంట్‌లేని చిత్రాలను కూడా మన వారు 'డిజె, మహానుభావుడు' టైప్‌లో మోసేస్తుంటే ఇక రవితేజకి అచ్చివచ్చిన ఆ ఎంటర్‌టైన్‌మెంట్ కాసింత బావుంటే మన ప్రేక్షకులు ఈ చిత్రానికి కూడా పూలమాల వేసి టెంకాయ కొట్టడం ఖాయమని చెప్పాల్సిందే.