ఒకప్పుడు 'జ్వాల, చంటి, పెదరాయుడు' వంటి సెన్సేషనల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి. కాగా ఆయన తన కుమారుడు ఆది పినిశెట్టిని ముందుగా తెలుగులో కన్నా తమిళంలో విభిన్న చిత్రాలతో పరిచయం చేశాడు. నటునిగా ఈయనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక రవిరాజా పినిశెట్టి అంటే మెగా కాంపౌండ్‌కి బాగా కావాల్సిన వ్యక్తి. దాంతో పాటు అందం, టాలెంట్ కూడా ఉండటంతో ఈయన బన్నీ నటించిన 'సరైనోడు' చిత్రంలో యంగ్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. కానీ తమిళంలోలాగా తొందరపడకుండా, హీరోగా మాత్రమే చేయాలని ఆశపడకుండా ఏరికోరి 'నిన్నుకోరి' వంటి చిత్రం చేశాడు. కాగా ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్-సుకుమార్‌ల 'రంగస్థలం 1985' చిత్రంతో పాటు పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్‌లో కూడా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు.
ఇక ఈ రెండు పాత్రలు వేటికవి విభిన్న పాత్రలని ఆది అంటున్నాడు. పీరియాడికల్ మూవీ, అందునా విలేజ్ బ్యాక్‌డ్రాప్ కావడంతో 'రంగస్థలం 1985'లో తన పాత్ర, నటన, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ వంటివన్నీ విభిన్నంగా ఉంటాయని తెలిపాడు. ఇక దానికి విరుద్దమైన లుక్‌తో, కార్పొరేట్ స్టైల్‌లో పవన్ సినిమాలో తన పాత్ర ఉంటుందని చెప్పాడు. ఈ రెండు విభిన్న చిత్రాలను చేస్తుంటే.. తానేనా ఈ రెండు పాత్రలు చేస్తున్నది అనే అనుమానం తనకే కలుగుతోందని, ఇదంతా సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకుల మహిమ వల్లనే అంటున్నాడు. కాగా ఈరెండు చిత్రాలు కూడా దాదాపు కొద్ది గ్యాప్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగి.. రెండు చిత్రాలు హిట్టయితే అది ఆది పినిశెట్టికి ఇంక కొంతకాలం పాటు తిరుగుండదనే చెప్పాలి... !