కొందరు వ్యక్తులు అంత:ర్ముఖులుగా ఉంటారు. వారు తమ సహజ నైజాన్ని చూపించడం గానీ లేదా తమ మాటల ద్వారా చెప్పడం కానీ చేయరు. వారిలోని 'అపరిచితుడు' జీవితంలో ఒక్కసారే అన్నట్లుగా పైకి వస్తాడు. అప్పుడు షాక్ అవ్వడం చూసే వారి వంతు అవుతుంది. ఇక ఆ మధ్య చిరంజీవి కూతురి పెళ్లి వేడుకలో బాలయ్య వేసిన డ్యాన్స్ లేట్‌గా తెలుసుకున్న ప్రేక్షకులే కాదు... ఆయన అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇక విషయానికి వస్తే అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు కొడుకుల్లో ఎక్కువగా తెరవెనుక ఉండే వ్యక్తి వెంకట్ అక్కినేని, తెర ముందు మాత్రం నాగార్జున. అదే తరహాలో దగ్గుబాటి రామానాయుడు కుమారుల్లో పైకి కనిపించే వ్యక్తి విక్టరీ వెంకటేష్. ఈయన సాధారణంగా స్టార్ కావడంతో అందరి దృష్టి ఆయన మీదే ఉంటుంది.
ఇక ఆయన అన్నయ్య సురేష్‌బాబు మాత్రం అందరితో ముట్టిముట్టనట్లు తన పనిలో తానుంటాడు. పొడిపొడిగా అది కూడా ఎక్కువగా ఇంగ్లీషులోనే మాట్లాడుతారు. ప్రతి చోటా హుందాగా ఉంటాడు. కానీ వెంకట్ అక్కినేనిలా కాకుండా సురేష్‌బాబు మంచి అందగాడు. నాడు ఆయన తండ్రి రామానాయుడు ఆయన్ను ఎందుకు హీరో చేయకుండా తెరవెనుక నిర్మాతగా మార్చాడేమో గానీ ఈయన మంచి అందగాడు. ఇక ఈయన పిక్ ఒకటి ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో సందడి చేస్తోంది. నాగచైతన్య - సమంతల వివాహంలో ఆయన లుంగీ కట్టి, తువాలు చేతపట్టుకుని తీన్మార్ డ్యాన్స్‌ని సమంతతో కలిసి ఇరగదీస్తున్న పిక్ ఇప్పుడు సెన్సేషన్ అయింది.
సాధారణంగా వేడుకల్లో వెంకటేష్ హంగామా చేస్తుంటే తానెందుకు చేయకూడదని భావించాడో కానీ ఊరమాస్ లుక్‌లో అదరగొడుతున్నాడు. ఈయనకు విగ్గు ఒక్కటి తక్కువైందని, లేకపోతే హీరోలానే డ్యాన్స్‌లు గట్రాలో మెరిపించే వాడని అర్ధమవుతోంది. మరి తన తండ్రిలా ఈయన కూడా మొహానికి మేకప్ వేసుకుని అప్పుడప్పుడు తెరపై కూడా తరచుగా కనిపిస్తూ ఉంటే బాగుంటుందనిపిస్తోంది.