తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రను వివాదాలు లేకుండా ఆయననో జాతిపితగా చూపిస్తూ సినిమాను తీయడానికి బాలయ్య రెడీ అయ్యాడు. రేసులో పూరీ జగన్నాథ్, తేజ, అనిల్ రావిపూడి ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఒకప్పుడు కెరీర్ ప్రారంభంలో వరుస ప్రేమకథా చిత్రాలతో ఓ వెలుగువెలిగి తర్వాత తన సినిమాలను తానే కాపీ కొట్టుకునే పరిస్థితికి తేజ వచ్చాడు. మొత్తానికి దాదాపు పుష్కరం తర్వాత ఆయన రానాతో చేసిన 'నేనే రాజు.. నేనే మంత్రి' చిత్రంతో హిట్ అందుకున్నాడు. కథ కాపీ అనే ఆరోపణలను పక్కనపెడితే ఈ చిత్రం లోబడ్జెట్, ఎక్కువ భాషల్లో తీయడం వల్ల బాగానే లాభపడింది.
ఇక బాలయ్య మరోవైపు తన తండ్రి బయోపిక్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, తన తండ్రి పాత్రను తానే చేస్తానన్నాడు. వివాదాలు లేని ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎక్కడ మొదలుపెట్టాలో ఎక్కడ ముగించాలో తనకు బాగా తెలుసునని వ్యాఖ్యానించి, తన తండ్రి పాత్రను తానే చేస్తానని సెలవిచ్చాడు. ఈ చిత్రం దర్శకులలిస్ట్‌లో ఎక్కువగా తేజ పేరు వినిపిస్తోంది. 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంతో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలను బాగా తీయగలనని తేజ నిరూపించుకోవడంతో తేజను ఎంచుకున్నారని సమాచారం.
తాజాగా ఈ విషయాన్ని తేజ కూడా కన్‌ఫర్మ్ చేశాడు. బాలకృష్ణ తనను నాలుగైదు సార్లు పిలిపించుకుని ఈ విషయం మాట్లాడాడని కూడా చెప్పాడు. ఇక ఎన్టీఆర్ అంటే తనకు కూడా ఎంతో అభిమానమని, అదే సమయంలో ఆయన బయోపిక్ అంటే టెన్షన్‌గా కూడా ఉందని తేజ చెబుతున్నాడు. మరోవైపు తేజ వర్మకి మొదటి శిష్యుడు.
మరి శిష్యుడేమో భర్త కోణంలో సినిమా తీస్తానంటుంటే.. మరోవైపు వర్మ ఏమో భార్య లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ సంచలన జీవితాన్ని బయటపెడతానని చెబుతున్నాడు. మరి ముఖ్యంగా ఒకే వ్యక్తికి చెందిన రెండు విభిన్న కోణాల జీవితాన్ని ఇద్దరు గురుశిష్యులు తెరకెక్కించే అవకాశం ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇక బాలయ్య చేసే ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించే అవకాశాన్ని తనకు ఇస్తే 'నేనే రాజు నేనే మంత్రి'కి తేజకి ఇచ్చిన రెమ్యూనరేషన్ కంటే రెట్టింపు మొత్తాన్ని అంటే ఏకంగా 5కోట్లు తేజకి ఇస్తానని వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి అంటున్నాడట.