రెండు వారాల క్రితం దర్శకుడు తేజకి బాలకృష్ణ నుండి ఫోన్ కాల్ అంటూ ఒక టైటిల్ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. 'నేనే రాజు నేనే మంత్రి'తో ఫామ్ లో కొచ్చిన డైరెక్టర్ తేజతో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ విషయమై తేజకి ఫోన్ చేసినట్లుగా కథనాలు, కథలుకథలుగా ప్రచారం అయ్యాయి. కానీ అటు తేజగాని, ఇటు బాలకృష్ణగాని ఎక్కడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చెయ్యలేదు. అయితే ఇప్పుడు తాజాగా దర్శకుడు తేజ మాత్రం తాను బాలకృష్ణని కలిసినట్టుగా... ఎన్టీఆర్ బయోపిక్ పై చర్చించినట్టుగా చెబుతున్నాడు.
సీనియర్ ఎన్టీఆర్ అంటే తనకు విపరీతమైన అభిమానమని... ఎన్టీఆర్ బయోపిక్ విషయంపై బాలకృష్ణతో చర్చించిన మాట వాస్తవమే అని తేజ స్పష్టం చేశాడు. అయితే ఆ చర్చల విషయం ఎలా వున్నా కానీ.. ఈ ప్రాజెక్టు ఇంకా ప్రాధమిక దశలోనే ఉందని.... ఆ సినిమా విషయంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బాలయ్యేనని తేజ చెబుతున్నమాట. ఎన్టీఆర్ వంటి మహానుభావుడు మీద సినిమా తెరకెక్కించే అవకాశం వస్తే అంతకన్నా మహద్భాగ్యం ఉండదని అంటున్నాడు. అయితే ఆ అవకాశం తనకే బాలకృష్ణ ఇస్తాడని ఆశాభావం మాత్రం తేజ మాటల్లో స్పష్టంగా అర్ధమవుతోంది.
మరి బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ పై అధికారిక ప్రకటన చేసినప్పటి నుండి ఆ సినిమాపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఎన్టీఆర్ బయోపిక్ పై జూనియర్ ఎన్టీఆర్ కూడా తన అభిప్రాయాన్ని ఎప్పుడో వెల్లడించాడు. ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తారా? అని జూనియర్ ఎన్టీఆర్ ని ఓ ఆంగ్లపత్రిక ప్రశ్నించినప్పుడు తాతగారి పాత్రలో నటించేంత ధైర్యం తనకు లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.