భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు క్రమంగా తన ప్రాభవం కోల్పోతున్న తెలుగు భాషను పునరుజ్జీవింప చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సూచన చేశారు. కన్నడిగులు, తమిళులలో ఉన్న భాషాభిమానం మనకు లేదు. విదేశాలలో ఉండే ప్రవాస తెలుగువారి పిల్లల నుంచి ఈ రాష్ట్రంలోనే పుట్టి, పెరిగిన వారు కూడా తెలుగుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓ కవి చెప్పినట్లు.. ఇతర భాషా జ్ఞానాన్ని సంపాదించు.. కానీ నీ మాతృభాషలోనే సంభాషించు.. తెలుగుదనం, తియ్యదనం గురించి చెప్పిన కవులు ఎందరో ఉన్నారు. మన తెలుగు వారు కలిసి మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువగా ఇంగ్లీషు, హిందీలలోనే మాట్లాడుతారు గానీ తెలుగులో మాట్లాడటాన్ని వారు తక్కువగా చూసే పరిస్థితులు ఉన్నాయి.
ఇతర భాషలను నేర్చుకుంటూ తెలుగుజాతి గొప్పతనం తెలుగుభాష తియ్యదనం గురించి మన పెద్దలు చిన్ననాటి నుంచే తమ పిల్లలకు తెలిపేలా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ మాతృభాష తన పూర్వవైభవాన్ని పోగొట్టుకుంటోంది. దీనికి కార్పొరేట్ స్కూళ్లు కూడా ప్రధానకారణం. అమ్మ, నాన్న అని పిలిపించు కోవడానికి ఇబ్బందిపడుతూ కార్పొరేట్ స్కూళ్లలో పిల్లలను చేర్చి.. మమ్మీ డాడీలకు అలవాటు పడుతున్నారు. ఇంతకు ముందు ఏ ప్రభుత్వ ఆఫీసులు, కోర్టులలో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే, వాడుక భాషలోనే ఉండాలని ఉత్తర్వులు ఇచ్చినా దానికి అతి గతి లేదు.
దాంతో తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు వచ్చి ఉంటేనే రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో, కళాశాలలో తెలుగును ఖచ్చితంగా నేర్చుకోవాలనే నిబంధన పెట్టాలని, తన సూచన మేరకే తెలంగాణ ముఖ్యమంత్రి తాజాగా ఈ విషయమై ఉత్తర్వులు ఇచ్చారని తెలిపాడు. పాశ్చాత్య మోజులో పడి మాతృభాషని నిర్లక్ష్యం చేయడం తగదని చెప్పి విలువైన సూచన ఇచ్చారు. కానీ కార్పొరేట్ స్కూళ్లకి, మరీ ముఖ్యంగా నారాయణ విద్యాసంస్థలకు మోకరిల్లిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంటుందా? లేదా? అనే అనుమానం మాత్రం వేస్తోంది...!